Indiramma Indlu Cheques : ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తొలి అడుగు వేసింది. ఈ పథకం తొలిదశలో భాగంగా అత్యంత నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ లబ్దిదారులకు చెక్కుల పంపిణీ షురూ చేశారు. మంగళవారం ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయల విలువైన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందించారు. మంగళవాం శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణలోని పలు జిల్లాలకు సంబంధించిన 12 మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల చెక్కులను పంపిణీ చేశారు. రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన వారికి తొలిదశ చెక్కులు అందించారు. ఇందిరమ్మ ఇల్లులో మొట్టమొదటి బిల్లును దేవరకద్రకు చెందిన తెలుగు లక్ష్మి, మరికొందరికి లక్ష రూపాయల చెక్కులను అందించారు. నోవాటెల్ హోటల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...ఎవరైనా పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరుగుతోంది. పలువురు ఎమ్మెల్యేలను సీఎం హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని గుర్తుచేశారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. దీనిపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని సీఎం తేల్చి చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో... గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఆమోదం పొందిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని సీఎం సూచించారు. ఆ కమిటీల పరిశీలన అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి పంపాలని, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదించాకే ఇండ్ల జాబితా ఖరారవుతుందని సీఎం స్పష్టం చేశారు.
ఈ వ్యవహారం సక్రమ పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ ప్రత్యేకాధికారి ఇందిరమ్మ కమిటీలు, మండల కమిటీలు, కలెక్టర్లు, ఇన్‌ఛార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ఉంటారని చెప్పారు.
సంబంధిత కథనం