CM Revanth Review : అక్రమాలను అడ్డుకోవాలి.. తిష్ట‌వేసిన అధికారుల‌ను బ‌దిలీ చేయండి - సీఎం రేవంత్ ఆదేశాలు-cm revanth reddy directed that all departments should achieve the annual target set in tax collections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Revanth Reddy Directed That All Departments Should Achieve The Annual Target Set In Tax Collections

CM Revanth Review : అక్రమాలను అడ్డుకోవాలి.. తిష్ట‌వేసిన అధికారుల‌ను బ‌దిలీ చేయండి - సీఎం రేవంత్ ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 26, 2024 07:03 PM IST

CM Revanth Reddy Review: నిర్దేశిత ల‌క్ష్యం మేర‌కు ప‌న్ను వ‌సూలు సాధించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్ ర‌వాణా అరిక‌ట్టాలని… వాణిజ్య ప‌న్నులు, రిజిస్ట్రేష‌న్ శాఖకు సొంత భ‌వ‌నాలు ఉండాలని దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Review News: ప‌న్ను వ‌సూళ్ల‌లో నిర్దేశించిన వార్షిక ల‌క్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించి వాణిజ్య ప‌న్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేష‌న్లు, ర‌వాణా, గ‌నులు, భూగ‌ర్భ వ‌నరుల శాఖ ప‌న్ను వ‌సూళ్ల‌పై డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్కర్ స‌చివాల‌యంలో సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో ప‌న్ను ల‌క్ష్యానికి, రాబ‌డికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎక్కువ‌గా ఎందుకు ఉంద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వం గ‌తేడాది వ‌ర‌కు జీఎస్టీ ప‌రిహారం కింద రూ.4 వేల కోట్ల‌కుపైగా చెల్లించేద‌ని, దాని గ‌డువు ముగియ‌డంతో ఆ నిధులు రాక‌పోవ‌డంతో రాబ‌డిలో వ్య‌త్యాసం క‌నిపిస్తోంద‌ని అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

పొరుగు రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. మ‌ద్యం స‌ర‌ఫ‌రా, విక్ర‌యాల‌కు సంబంధించిన లెక్క‌లు తేడాలు ఉంటున్నాయ‌ని, ఈ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌తి డిస్ట‌ల‌రీ వ‌ద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌న్నారు. మ‌ద్యం స‌ర‌ఫ‌రా వాహ‌నాల‌కు జీపీఎస్ అమ‌ర్చి వాటిని ట్రాకింగ్ చేయాల‌ని, బాటిల్ ట్రాకింగ్ సిస్టం ఉండాల‌ని, మ‌ద్యం స‌ర‌ఫ‌రా వాహ‌నాలు వే బిల్లులు క‌చ్చితంగా ఉండాల‌ని రేవంత్ రెడ్డి ఆదేశించారు. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్‌తో పాటు గ‌తంలో న‌మోదు చేసిన ప‌లు కేసుల పురోగ‌తిపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

రిజిస్ట్రేష‌న్ల శాఖ‌పై స‌మీక్ష సంద‌ర్భంలో స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాలు, జిల్లా రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు అద్దె భ‌వ‌నాల్లో కొన‌సాగుతున్నాయని అధికారులు తెలిపారు. అదే స‌మ‌యంలో త‌మ‌ శాఖలోనూ అదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని వాణిజ్య ప‌న్నుల శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవి…. ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్య‌మంత్రి ఆదాయాన్ని తెచ్చే శాఖల‌కు సొంత భ‌వ‌నాలు లేక‌పోవ‌డం స‌రికాద‌ని, ప్రస్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న భ‌వ‌నాలు నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అవ‌స‌రాల‌కు అనుగుణంగా హైద‌రాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు. హైద‌రాబాద్‌తో పాటు న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో ర‌హ‌దారుల‌పై కంక‌ర కుప్పలుగా పోసి విక్ర‌యిస్తున్నార‌ని, అలా కాకుండా న‌గ‌రంలో వివిధ ప్ర‌దేశాల్లో ప్ర‌భుత్వ స్థ‌లాలను అందుకు వినియోగించాల‌ని పేర్కొన్నారు.

ఇసుక విక్ర‌యాల‌పై స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వే బిల్లుల‌తో పాటు ఇసుక స‌ర‌ఫ‌రా వాహ‌నాల‌కు ట్రాకింగ్ ఉండాల‌ని, అక్రమ ర‌వాణాకు అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకుగానూ ప‌లు గ‌నుల‌పై గ‌తంలో జ‌రిమానాలు విధించార‌ని, కేసులు న‌మోదు చేశార‌ని గుర్తు చేశారు. విధించిన జ‌రిమానాల‌ను వెంట‌నే వ‌సూలు చేయాల‌ని ఆదేశించారు. గ‌తంలో జ‌రిమానాలు విధించి త‌ర్వాత వాటిని త‌గ్గించార‌ని, అందుకు కార‌ణాలు ఏమిటో తెలియ‌జేయాల‌ని, దానిపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌కు ముఖ్య‌మంత్రి సూచించారు. టీఎస్ ఎండీసీతో పాటు గ‌నుల శాఖ‌లో ప‌లువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల త‌ర‌బ‌డి తిష్ట వేశార‌ని, కొంద‌రిపై ఆరోప‌ణ‌లున్నాయ‌ని, వారిని వెంట‌నే బ‌దిలీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు - సీఎం రేవంత్ రెడ్డి

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… తెల్ల రేషన్ కార్డు ఆధారంగా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు లేని వారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని…. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ స్కీమ్ లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే… సరిదిద్దుకునే అవకాశం ఉందన్నారు. అర్హత ఉన్నప్పటికీ రానివాళ్లు…. మండల ఆఫీస్ లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని చెప్పారు. సాగు చేయని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారని… ఇలా 22 వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని అన్నారు ముఖ్యమంత్రి. కానీ తమ ప్రభుత్వంలో… ఇలాంటి వాటికి అవకాశం ఉండదన్నారు. రైతుబంధులో లేనిపోని అపోహలను నమ్మవద్దని స్పష్టం చేశారు. అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. కేటీఆర్ కామెంట్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని… అన్నింటిపై విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. గొర్రెల స్కామ్ పై ఏసీపీ విచారణ జరుగుందని… వాస్తవాలు బయటికి వస్తున్నాయని అన్నారు.

IPL_Entry_Point