CM Revanth - CBN : చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు - చెప్పినట్టుగానే ఇద్దరి భేటీ ఉంటుందా..?
CM Revanth reddy - Chandrababu: ఏపీ ఎన్నికల్లో విక్టరీ సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు.
CM Revanth Reddy - Chandrababu : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే చంద్రబాబుతో పాటు పవన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అయితే గురువారం… చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ప్రత్యేకంగా మాట్లాడారు.

ఏపీలో అద్భుతమైన విజయం సాధించిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించినట్లు తెలిసింది.
కొత్త సీఎంను కలుస్తారా…?
గత నెల 22వ తేదీన తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన…. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిని కలుస్తానని చెప్పారు.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధిపథంలో నడవాలని ఆకాంక్షించారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరపున సత్రం, కల్యాణమండపం నిర్మిస్తామని తెలిపారు. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేవలం తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఉపయోగపడేలా ఈ సత్రాన్ని నిర్మిస్తామని చెప్పుకొచ్చారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. మనుమడి పుట్టు వెంట్రుకలు సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమలకు వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
గతేడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు ఏపీలో వైసీపీ సర్కార్ ఉంది. అయితే ఇరువురు ముఖ్యమంత్రి కలిసిన సందర్భం లేదు. పైగా ఏపీలో ఎన్నికల ప్రకటన రావటంతో…. ప్రచారం హడావిడి మొదలైంది. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి… సీఎం జగన్ కనీసం అభినందనలు కూడా చెప్పలేదన్న వార్తలు కూడా వినిపించాయి.
జూన్ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం….
ఇటీవలే వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా…. సత్ససంబంధాలనే కోరుకుంటున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఇరు రాష్ట్రాలు కూడా అభివృద్ధిపథంలో నడవాలని ఆకాంక్షించారు.
ఇరు ముఖ్యమంత్రుల భేటీపై గతంలోనే రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో…. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కలిసే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు…. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ఉండటంతో ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే.