Kurumurthy Brahmotsavam : కురుమూర్తి స్వామి ఆలయానికి మహర్దశ.. వరాలు ప్రకటించిన సీఎం రేవంత్-cm revanth reddy announces rs 110 crore for development of kurumurthy swamy temple ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kurumurthy Brahmotsavam : కురుమూర్తి స్వామి ఆలయానికి మహర్దశ.. వరాలు ప్రకటించిన సీఎం రేవంత్

Kurumurthy Brahmotsavam : కురుమూర్తి స్వామి ఆలయానికి మహర్దశ.. వరాలు ప్రకటించిన సీఎం రేవంత్

Kurumurthy Brahmotsavam : సీఎం రేవంత్ సొంత జిల్లాలోని ఆలయ అభివృద్ధి కోసం భారీగా నిధులు ప్రకటించారు. కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం.. రూ.110 కోట్లతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కురుమూర్తి స్వామి ఆలయానికి మహర్దశ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. శ్రీ కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత జిల్లాపై తనకుమ్మ మమకారాన్ని పంచుకున్నారు. అలాగే కురుమూర్తి స్వామివారి ఆలయ అభివృద్ధి కోసం భారీగా నిధులు ప్రకటించారు.

'పేదల తిరుపతిగా కురుమూర్తి స్వామి ఆలయం ప్రసిద్ధి పొందింది. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.110 కోట్లతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నా' అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

'వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. అలాంటి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమే. తెలంగాణ వచ్చి పదేళ్లయినా వలసలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి పాడిపంటలతో విలసిల్లేట్లు చేసేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలుంటాయి. నారాయణ్ పేట్ కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్ కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు పారిస్తాం' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

'మా ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కొందరు ఆరోపణలు చేసి చిల్లర రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు. నాపై కోపం ఉంటే రాజకీయంగా నాపై కక్ష సాధించండి. ప్రాజెక్టులను అడ్డుకోవద్దు. జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు.

అలా చేస్తే పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదు' అని రేవంత్ హెచ్చరించారు. 'నేను ఎక్కడ ఉన్నా.. ఈ జిల్లా అభివృద్దిని కాంక్షించేవాడినే. జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో 2వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచ్చినా ఈ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. జిల్లాలో గ్రామ గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మాది' అని రేవంత్ హామీ ఇచ్చారు.

'విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం. కాళ్లల్లో కట్టెలు పెట్టి, కుట్రలు చేసి ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పాలమూరు బిడ్డలు క్షమించరు' అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.