ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదన్నారు.
పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యా శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యా ప్రమాణాలు పెంపు లక్ష్యంతో రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.