Telangana Congress : మీరు మాట్లాడేదంతా రికార్డవుతుంది.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ క్లాస్‌!-cm revanth reddy anger at clp meeting over congress mlas behavior ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Congress : మీరు మాట్లాడేదంతా రికార్డవుతుంది.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ క్లాస్‌!

Telangana Congress : మీరు మాట్లాడేదంతా రికార్డవుతుంది.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ క్లాస్‌!

Telangana Congress : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలకు రేవంత్ క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. తీరు మార్చుకోవాలని.. లేకపోతే నష్టం తప్పదని హెచ్చరించినట్టు సమాచారం.

సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ క్లాస్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఒక్క ఎమ్మెల్యే కూడా సోషల్ మీడియా వాడటం లేదన్న రేవంత్.. ప్రభుత్వంపై నెగిటివ్‌ ప్రచారం చేస్తుంటే.. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

వీకెండ్ రాజకీయాలు వద్దు..

'కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. వీకెండ్‌ రాజకీయాలు చేయొద్దు. మంత్రి పదవుల విషయం అధిష్ఠానం చూసుకుంటుంది. మీరు మాట్లాడేదంతా రికార్డవుతుంది. పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడొద్దు. కొందరి తీరు రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతోంది. సున్నితమైన అంశాలపై నోరు పారేసుకోవద్దు' అని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు సూచించారు.

ప్రజల్లోకి వెళ్లాలి..

'ప్రజాప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రజల్లోకితీసుకెళ్లాలి. రేపటి నుంచి జూన్ 2 వరకు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకోవాలి. గతంలో రూ.2కే కిలో బియ్యం.. ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుంటాయి. భూ భారతి పోర్టల్‌ను రైతులకు చేరువచేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదర్శం' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

విష ప్రచారం చేశారు..

'కులగణన ద్వారా వందేళ్ల సమస్యను పరిష్కరించాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు తెచ్చాం. ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపాం. తెలంగాణ పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది. దేశంలో తెలంగాణ మోడల్‌పై చర్చ జరుగుతోంది. కంచ గచ్చిబౌలి భూములపై ఏఐతో అబద్ధపు ప్రచారం చేశారు. ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తున్నాయి' అని రేవంత్ వివరించారు. సీఎల్పీ మీటింగ్ తర్వాత సీఎం రేవంత్‌ జపాన్‌ పర్యటనకు బయల్దేరారు.

ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు..

మహబూబాబాద్‌‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'మంత్రివర్గ విస్తరణ వెంటనే ప్రభుత్వం కుప్పకూలుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం భయపడుతోంది. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. రాసిపెట్టుకోండి స్థానిక సంస్థల్లో వార్‌ వన్‌ సైడ్‌. ఎన్నికలు పెట్టి చూడండి.. మా సత్తా తెలుస్తుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గెలుస్తాం. గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాం' అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

కిషన్ రెడ్డి కౌంటర్..

కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. 'ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు. గుజరాత్ వ్యాపారులు ప్రభుత్వాన్ని ఎందుకు కూలుస్తారు. రేవంత్ ఐదేళ్ల పాటు పాలన చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు ఘోర ఓటమి ఖాయం. కాంగ్రెస్‌ పాలనతో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. కాంగ్రెస్‌ ఓడిపోతుందని కామన్ మ్యాన్‌కు కూడా తెలుసు' అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం