రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూధార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ, ఇతర మ్యుటేషన్లకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. లైసెన్డ్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలని ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో నూతనంగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశీలించారు.
ప్రతి కార్యాలయంలో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. కార్యాయాలు పూర్తిగా ప్రజలకు స్నేహ పూర్వక వాతావరణంలో, సౌకర్యవంతంగా ఉండేలా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు వివరించగా… ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్‌గా ఉన్న ప్రాజెక్టుల్లోని తలెత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలోని 594 మండలాల్లో 10,226 రెవెన్యూ సదస్సులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో 8,27,230 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం కూడా వెల్లడించింది. ఈ దరఖాస్తులను డేటా ఫార్మేట్ లో భూ భారతి పోర్టల్ లో కూడా నమోదు చేశారు. వీటి ఆధారంగా సమస్యలను పరిష్కారం చేసే దిశగా రెవెన్యూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆగస్ట్ 15లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ గా విధించింది.
భూభారతి చట్టం ద్వారా దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఏప్రిల్ 17వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు దశల వారీగా రెవెన్యూ సదస్సులను నిర్వహించింది. సర్వే నెంబర్లలో లోపాలు పీపీబీ, ఆర్వోఆర్, నాలా, ఆర్ .ఎస్ .ఆర్ సవరణ, అప్పీల్స్, కోర్టు కేసులు, పోడుభూములు తదితర 30 రకాల భూ సమస్యలపై 8.27 లక్షల దరఖాస్తులు వచ్చాయి.