CM Revanth Review : గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ విధానం-cm revanth ordered to study the establishment of underground electricity cable system in hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Review : గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ విధానం

CM Revanth Review : గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ విధానం

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 12, 2025 06:55 AM IST

Telangana Clean and Green Energy Policy 2025: అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్ కేబుల్‌ విధానాన్ని హైదరాబాద్‌లో అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వివిధ దేశాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలించాలని సూచించారు. అండర్ గ్రౌండ్ కేబుల్ విధానంతో విద్యుత్ నష్టాలను తగ్గించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 ఆవిష్కరణ
తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 ఆవిష్కరణ

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి వివిధ దేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి నివేదిక అందించాలని సూచించారు.

ఇంటిగ్రేడెట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) లో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. అనంతరం పాలసీపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యుత్ కేబుల్స్‌తో పాటు ఇతరత్రా వివిధ రకాల కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా వివిధ ప్రత్యమ్నాయాలు పరిశీలించాలని చెప్పారు.

అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు చౌర్యం అరికట్టడమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ అంతరాయం వంటి సమస్యలను అధిగమించవచ్చని ముఖ్యమంత్రి వివరించారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు - సీఎం రేవంత్

వచ్చే వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గత ఏడాది మార్చిలో పీక్ డిమాండ్ 15,623 మెగా వాట్లకు చేరిందని గుర్తు చేశారు. ఈ సారి 16,877 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు అధికారులు వివరించగా… గరిష్ఠ విద్యుత్ డిమాండ్ అంచనాకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. వ్యవసాయానికి, గృహ అవసరాలకు మార్చి నెలలో పీక్ విద్యుత్ డిమాండ్ ఉంటుందని, దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.

ఆదివాసీ గూడెలలో గృహాలకు సోలార్ విద్యుత్, సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అటవీశాఖ, గిరిజన సంక్షేమం శాఖతోపాటు సంబంధిత శాఖలతో సమావేశమై వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే కంపెనీలను ఆహ్వానించి ఏ విధానంలో వారికి పనులను అప్పగించాలనే ప్రణాళిక తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు.

కొత్త ఉస్మానియాకు శంకుస్థాపన:

హైదరాబాద్ నగరంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సీఎం  రేవంత్ రెడ్డి సూచించారు. కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన ప్రణాళికలపై శనివారం సమీక్ష నిర్వహించారు.

 గోషామహల్ పోలీస్ స్టేడియంలో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా వైద్యఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం