ఫ్యూచర్ సిటీ కోసం భూసేకరణను త్వరగా పూర్తి చేయండి - సీఎం రేవంత్ ఆదేశాలు-cm revanth ordered the completion of the land acquisition process for bharat future city as soon as possible ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఫ్యూచర్ సిటీ కోసం భూసేకరణను త్వరగా పూర్తి చేయండి - సీఎం రేవంత్ ఆదేశాలు

ఫ్యూచర్ సిటీ కోసం భూసేకరణను త్వరగా పూర్తి చేయండి - సీఎం రేవంత్ ఆదేశాలు

పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఫ్యూచర్ సిటీ కోసం భూ సేకరణ ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెట్టుబడులను ఆకర్షించే దిశగానే ప్రణాళికలు ఉండాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి

భారత్ ఫ్యూచర్ సిటీ కోసం భూ సేకరణ ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక వేత్తలు ఎవరూ వెనక్కి వెళ్లరాదని… ఆ రకమైన ప్రణాళికలతో పరిశ్రమల శాఖ సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పారు.

భూ సేకరణను పూర్తి చేయండి - సీఎం రేవంత్

పరిశ్రమల శాఖకు సంబంధించిన అంశాలపై శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్‌గా మారిన పరిస్థితుల్లో కొత్తగా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే సంస్థల డేటా సెంటర్ల ఏర్పాటుకు కావలసిన స్థలం సిద్ధం చేయాలని చెప్పారు. నిమ్జ్‌లో మిగిలి ఉన్న భూ సేకరణను తక్షణమే పూర్తి చేయాలన్నారు. అందుకు రైతులతో సంప్రదించి ఒప్పించాలని చెప్పారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అందుకు అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఆర్కిటెక్ట్‌ను నియమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రికెట్, ఫుట్‌బాల్, గోల్ఫ్ వంటి అన్ని క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండేలా ప్రణాళికలు సిద్దం చేయాలని చెప్పారు.

రాష్ట్రంలో ప్రతిపాదిత మెగా ప్రాజెక్టులపైన మంత్రివర్గ ఉప సంఘం ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై వాటి పురోగతిపైన చర్చించాలన్నారు. 2024 లో హైదరాబాద్ నగరానికి 70 GCC లు వచ్చాయని గుర్తు చేశారు. 2025 లో ఇప్పటివరకు 25 రాగా మరిన్ని సెంటర్లు వచ్చేలా ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. అందుకోసం అధికార యంత్రాంగం వంద రోజుల లక్ష్యంతో ప్రణాళికను సిద్ధం చేసుకుని పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్‌ సిటీ పేరును భారత్‌ ఫ్యూచర్‌ సిటీగా మార్చింది. మహానగరానికి అదనపు ఆకర్షణగా నాలుగో నగరాన్ని (ఫ్యూచర్‌సిటీ) నిర్మించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక్కడ పలు సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరిగాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.