Hyderabad Water Supply : మల్లన్నసాగర్ నుంచే హైదరాబాద్‌కు నీటి తరలింపు - గోదావరి ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్, కీలక నిర్ణయాలు
మల్లన్నసాగర్ నుంచే గోదావరి ఫేజ్-2 తాగునీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ జలమండలి బోర్డు సమావేశంలో మాట్లాడిన ఆయన.. 2050 నాటికి పెరిగే జనాభా అవసరాలకు తగినట్టుగా హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరాకు మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు.
2050 నాటికి పెరిగే జనాభా అవసరాలకు తగినట్టుగా హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరాకు మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇవాళ హైదరాబాద్ జలమండలి బోర్డు తొలి సమావేశం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి…. తాగునీటితో పాటు భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా సివరేజీ ప్రణాళికను రూపొందించడంలో ఏజెన్సీలు, కన్సల్టేన్సీలతో అధ్యయనం చేయించాలని దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో జనాభాకు సరిపడే విధంగా తాగునీటి సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు. నీటి సరఫరాకు నగరంలో మొత్తం 9.800 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా 13.79 లక్షల కనెక్షన్లతో నీటి సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
15 కాదు… 20 టీఎంసీలు…!
నగరానికి మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతుండగా, గోదావరి ఫేజ్ 2 ద్వారా మరింత నీటిని తరలించి ఉస్మాన్‌సాగర్ , హిమాయత్‌సాగర్ వరకు తాగునీటి సరఫరాకు డిజైన్ చేసిన ప్రాజెక్టుపై సమావేశంలో చర్చ జరిగింది. తాగునీటి అవసరాలకు సంబంధించి కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నీటి లభ్యత, లిఫ్టింగ్ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని మల్లన్నసాగర్ నుంచే గోదావరి ఫేజ్-2 తాగునీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీలకు బదులు, సిటీ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీల నీటిని తరలించేలా మార్పులకు ఆమోదం తెలిపారు.
హైదరాబాద్ జలమండలి ఆదాయ వ్యయాల నివేదికను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జలమండలి తమ సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని, అందుకు అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జలమండలి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.
తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు.అందుకు వీలుగా ప్రాజెక్టు డీపీఆర్లు తయారు చేయించాలని చెప్పారు. నగరంలో పలు ప్రాంతాలకు మంజీరా ద్వారా 1965 నుంచి నీటిని సరఫరా చేస్తున్న పైపులైన్లకు కాలం చెల్లిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మరో అధునాతన లైన్ నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు.
సంబంధిత కథనం