TG Employees: కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదు - సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు-cm revanth key comments on regularization of contract employees ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Employees: కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదు - సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

TG Employees: కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదు - సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 04, 2025 06:28 AM IST

కాంట్రాక్ట్ , ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని ఉన్నప్పటికీ.. చేయలేని పరిస్థితిలో ఉన్నామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళనలపై స్పందించిన ఆయన. వారిని క్రమబద్ధీకరించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందన్నారు.

yearly horoscope entry point

రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని అన్నారు. ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, వారికి నష్టం కలిగించే పనులు ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని క్రమబద్థీకరించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఆ అలాంటి అవకాశం లేదు - సీఎం రేవంత్ రెడ్డి

సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం కింద పనిచేస్తోందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. “అందులో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధం చేసే అవకాశం లేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉన్నా ప్రభుత్వానికి చేయలేని పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని చెప్పారు.

“ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని ఒక కార్యాచరణ ప్రకారం ప్రభుత్వం పరిష్కరిస్తుంది. కొందరు రాజకీయాల కోసం నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని, అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రూ. 4,000 కోట్ల లోటు ఉంటోంది - ముఖ్యమంత్రి

“గత పదేళ్లలో పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మేం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశాం. తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల మొదటి తారీఖు జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం కష్టకాలంలో బాధ్యతలు చేపట్టింది. ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వంలో కనీస అవసరాలకు ప్రతీ నెల రూ. 22,500 కోట్లు అవసరం ఉండగా, రూ. 18,500 కోట్లు మాత్రమే ఆదాయం వస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. ఇంకా రూ. 4,000 కోట్ల లోటు ఉంటోందన్నారు. వచ్చే ఆదాయంలో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నామని చెప్పారు. మరో రూ. 6,500 కోట్లు ప్రతి నెల అప్పులు చెల్లిస్తుండగా, మిగిలిన రూ. 5,500 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

“నిజానికి ప్రభుత్వం అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే నెలకు రూ. 30 వేల కోట్లు అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం మనందరిది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉద్యోగుల సహకారం కావాలి. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి” అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం