Krishna Water : ఏపీ విషయంలో అలర్ట్ గా ఉండండి.. టెలీమెట్రీ అమలుకు లేఖ రాయండి - సీఎం రేవంత్ ఆదేశాలు-cm revanth instructed officials to release water for crops under various state irrigation projects as per the schedule ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Krishna Water : ఏపీ విషయంలో అలర్ట్ గా ఉండండి.. టెలీమెట్రీ అమలుకు లేఖ రాయండి - సీఎం రేవంత్ ఆదేశాలు

Krishna Water : ఏపీ విషయంలో అలర్ట్ గా ఉండండి.. టెలీమెట్రీ అమలుకు లేఖ రాయండి - సీఎం రేవంత్ ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 18, 2025 05:05 AM IST

ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమన్నారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా చూడాలని చెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులకు సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎండలు పెరిగిన కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులను ముందస్తు అంచనా వేసుకొని పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంటలకు సాగునీటి విడుదలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం సమీక్షించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీతో పాటు ప్రధాన ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, నీటి వినియోగం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

3 నెలలు అత్యంత కీలకం - సీఎం రేవంత్

ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పారు. రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని, రాష్ట్ర మంతటా అన్ని ప్రాంతాల్లో సాగు, తాగునీరు, విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందన్నారు. వెంటనే సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి జిల్లాల వారిగా అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పంటలు, నీటి విడుదలపై ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత ఇరిగేషన్ ఇంజనీర్లతో వెంటనే సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రాజెక్టులు, కాల్వలు, ఆయకట్టులో పంటలు, నీటి విడుదల తీరును కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలని సూచించారు. నిర్ణీత ఎజెండాను ఖరారు చేసుకొని అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

టెలిమెట్రీ విధానమే పరిష్కారం..

శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిర్ణీత కోటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానమే పరిష్కారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

టెలీమెట్రీ విధానం అమలుకు అయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావటం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. టెలీమెట్రీ విధానం అమలుకు అవసరమైన నిధులన్నీ ముందుగా మన ప్రభుత్వమే చెల్లిస్తుందని, వెంటనే టెలీమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వెంటనే కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాని ఆదేశించారు.

నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జల సంఘంపైనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించే విషయంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం