Vikarabad : ఎకో టూరిజం అభివృద్ధి.. ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Vikarabad : వికారాబాద్ సమీపంలో ఎక్స్‌పీరియం పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.
ఒక మంచి ఎకో టూరిజం పార్క్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వికారాబాద్ సమీపంలో ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం.. ప్రజా ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లిందని వివరించారు. రాష్ట్రంలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.
ఎకో టూరిజం అభివృద్ధి..
'టెంపుల్, ఎకో టూరిజం రాష్ట్రానికి గుర్తింపుతో పాటు.. ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంది. దేవాలయ దర్శనాలకు, అటవీ సంపదను చూసేందుకు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాం. రామప్ప, వేయిస్తంభాల గుడి లాంటి అద్భుతమైన ఆలయాలు తెలంగాణలో ఉన్నాయి. నల్లమల అడవులు, మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని రేవంత్ స్పష్టం చేశారు.
టూరిజం పాలసీ..
'త్వరలో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నాం. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. ఎక్స్‌పీరియం లాంటి ఎకో టూరిజం పార్కును ఇక్కడ అభివృద్ధి చేయడం అభినందనీయం. రాబోయే రోజుల్లో ఇది అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారుతుంది. వికారాబాద్ అటవీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. త్వరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయబోతున్నాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
మొక్కలు నాటాలి..
'రాష్ట్ర ఆలోచనకు అనుగుణంగా రామ్ దేవ్ ఈ పార్క్‌ను అభివృద్ధి చేయడం అభినందనీయం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని భావిస్తోంది. వనజీవి రామయ్య లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతీ విద్యార్థితో తల్లి పేరుపై ఒక మొక్కను నాటించి సంరక్షించేలా కొన్ని విధానాలు తీసుకురాబోతున్నాం' అని ముఖ్యమంత్రి వివరించారు.
అభినందనీయం..
అనంతరం చిరంజీవి మాట్లాడారు. 'నేను ఇల్లు కట్టుకున్నప్పుడే రామ్ దేవ్ నాకు కొన్ని విదేశీ మొక్కలు ఇచ్చారు. మా ఇంటి వద్ద పెరిగిన మొక్కలను చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మన హైదరాబాద్‌కు ఇలాంటి మొక్కలను రామ్ దేవ్ తీసుకురావడం అభినందనీయం. ఆయన వ్యాపారవేత్తగానే కాకుండా కళాకారుడిగా కనిపించారు' అని చిరంజీవి వ్యాఖ్యానించారు.