TG Indiramma Housing Scheme : పక్కాగా లబ్ధిదారుల ఎంపిక - 'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్'లో అలాంటి వారి పేర్లు రద్దు...!
TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని సీఎం రేవంత్ స్పష్టం చేశాారు. దందాలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అనర్హులు ఇండ్లు నిర్మించుకున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలతో పాటు… వారు పొందిన నిధులను వసూలు చేయాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే గృహాలను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని ఉద్ఘాటించారు.
తనిఖీ చేసి ధ్రువీకరించండి…
గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి…. అధికారులకు కీలక సూచనలు చేశారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు అత్యంత జాగ్రత్తగా పనిచేయాలన్నారు. కమిటీలు తయారు చేసిన అర్హుల జాబితాను తహశీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్‌లతో కూడిన మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేసి… ధృవీకరించాలని దిశానిర్దేశం చేశారు.
తక్షణమే కేసులు నమోదు చేయండి - సీఎం రేవంత్
ఒకవేళ అనర్హులకు ఇండ్లు కేటాయించబడినట్లు తేలితే, వెంటనే ఇందిరమ్మ కమిటీకి తెలియజేయాలని… ఆ స్థానంలో అర్హులైన వారికి గృహం మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. “పథకంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలి. దందాలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలి. అనర్హులు ఇండ్లు నిర్మించుకున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలతో పాటు, వారు పొందిన నిధులను వసూలు చేయాలి” అని తెలిపారు.
“లబ్ధిదారుల సౌకర్యం కోసం అదనపు సదుపాయాలను కల్పించాలి. గృహ నిర్మాణంలో లబ్ధిదారులు తమ అవసరాలకు అనుగుణంగా 50 శాతం అదనపు స్థలాన్ని నిర్మించుకునే అవకాశం కల్పించాలి. ఇందిరమ్మ ఇండ్లకు సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే లక్ష్యంతో రూపొందింది కాబట్టి ఈ పథకం అమలులో పారదర్శకత, నిజాయితీ ప్రధానంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. అర్హులైన వారికి మాత్రమే ఈ గృహాలు దక్కేలా చూడాలని స్పష్టం చేశారు.
మొదటి దశలో రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక గ్రామం నుంచి లబ్ధిదారులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరికి ప్రోసిడింగ్ కాపీలను కూడా అందించారు.అయితే వీరిలో కొంత మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో… అలాంటి వారిని పక్కనపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి ప్రోసిడింగ్ కాపీలను కూడా వెనక్కి తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు.
ఈనెలాఖారులోగా జాబితాలు ప్రకటన…!
మరోవైపు ఈ ఏప్రిల్ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే… లబ్ధిదారులను గుర్తించాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలోపే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించి… ప్రోసిడింగ్స్ ఇవ్వాలని సర్కార్ చూస్తోంది. అంతేకాదు కనీసం పునాది, పిల్లర్ల వరకు నిర్మాణాలు పూర్తిచేసి సంబంధిత సొమ్ము లబ్ధిదారుడికి అందజేయాలని చూస్తోంది.
ఇప్పటికే ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 జాబితాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో ఎల్ 1లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో పేర్లు ఉన్నవారి నుంచే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గ్రామస్థాయిలోని ఇందిరమ్మ కమిటీల సాయంతో… అసలైన లబ్ధిదారులను గుర్తించనున్నారు.