రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం - సీఎం రేవంత్ రెడ్డి-cm revanth commented that congress will be in power in the state for the next ten years ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం - సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం - సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన… పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం

గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కుల గణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామని వ్యాఖ్యానింతారు.

“నేను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నాం. యూత్ కాంగ్రెస్, NSUI, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి మన ప్రభుత్వంలో పదవులు వరించాయి. పార్టీ పదవులను క్యాజువల్ గా తీసుకోవద్దు. పార్టీ పదవులతోనే మీకు గుర్తింపు, గౌరవం. రాజకీయాల్లో మీ ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషను, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయి” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రసగించారు.

పదేళ్లు మనదే అధికారం - సీఎం రేవంత్

నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “మీరు నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి. గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలి. మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలి. మనందరం కలిసికట్టుగా ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలి. రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం. సుదీర్ఘ కాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేది వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలి.పార్టీ పదవితోనే అందరికీ గౌరవం, గుర్తింపు” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

గెలుపే ధ్యేయంగా పని చేయాలి - మహేశ్ కుమార్ గౌడ్

సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కొత్తగా నియమితులైన వారికి పార్టీ చక్కని అవకాశం కల్పించింద్నారు. సద్వినియోగం చేసుకోవల్సిన బాధ్యత వారందరిపై ఉందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు..అభివృద్ది తో పార్టీ మరోసారి 90 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమర భేరి సభను తలపెట్టిందని చెప్పారు.

ఖర్గే సీరియస్….!

రెండున్నర గంటలపాటు పీఏసీ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై నేతలకు ఖర్గే దిశానిర్దేశం చేశారు. కొత్త, పాత నేతలను కలుపుకొని పోవాలని సూచించారు. ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ తో కోఆర్టినేట్‌ చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలన్న ఆయన… కుల గణనపై ప్రభుత్వ పనితీరు అభినందనీయమని ప్రశంసించారు.

పార్టీలోని కొందరు నేతల తీరుపై ఖర్గే సీరియస్‌ అయినట్లు సమాచారం. నలుగురైదుగురు గ్రూపులు కడితే భయపడతారనుకుంటున్నారా? అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను అధినాయకత్వం పట్టించుకోదని… వాళ్ల సంగతి పార్టీ క్రమశిక్షణా కమిటీ తేలుస్తుందని హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పని చేయాలని స్పష్టం చేశారు.

ఇక ఇవాళ ఉదయం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని లక్డికాపూల్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖర్గేతో పాటు సీఎం రేవంత్, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.