CM KCR Warning : చిట్టా మొత్తం ఉంది, ఇదే ఫైనల్ వార్నింగ్.. దళితబంధులో కమీషన్లపై KCR కన్నెర్ర..!-cm kcr warning to party mlas over allegations against dalit bandhu scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Warning To Party Mlas Over Allegations Against Dalit Bandhu Scheme

CM KCR Warning : చిట్టా మొత్తం ఉంది, ఇదే ఫైనల్ వార్నింగ్.. దళితబంధులో కమీషన్లపై KCR కన్నెర్ర..!

HT Telugu Desk HT Telugu
Apr 27, 2023 07:11 PM IST

cm kcr latest news: సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. దళితబంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని… ఇదే వారికి లాస్ట్ వార్నింగ్ అని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

CM KCR On Dalit Bandhu Scheme: పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా ప్రజాప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించింది బీఆర్ఎస్ అధినాయకత్వం. కేసీఆర్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో... పలు కీలక అంశాలపై చర్చించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వంద సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, కేడర్ లో అసంతృప్తి పాటు దళితబంధు పథకాల్లో అక్రమాల వంటి అంశాలపై కేసీఆర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న దళితబంధు పథకంలో కొందరు ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని.. ఆ చిట్టా కూడా తన దగ్గర ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దళితబంధులో భాగంగా లబ్ధిదారులకు ఇస్తున్న డబ్బుల్ని కొందరు ఎమ్మెల్యేలు లంచంగా తీసుకుంటున్నారన్న సమాచారం తన వద్దని, ఇందుకు సంబంధించి ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయని ప్రస్తావించారట..! ఇచ్చే 10 లక్షల్లో 3 లక్షల వరకు నొక్కేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని... ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వొద్దని హెచ్చరించారని తెలుస్తోంది. అలాంటి పనులు చేసే ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్ అని... ఇలాంటి తప్పులు మరోసారి చేస్తే పార్టీ నుంచే తప్పిస్తామని స్పష్టం చేశారు. కేవలం ఎమ్మెల్యేలే కాదని అనుచరులు డబ్బులు తీసుకున్న ఎమ్మెల్యేలదే బాధ్యత అని కేసీఆర్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక ఇదే సమయంలో పలు నియోజకవర్గాల్లోని టికెట్ల పంచాయితీలపై కూడా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎవరికి టికెట్లు ఇవ్వాలో తనకు తెలుసని చెబుతూనే… పలువురు నేతలకు అల్టిమేటం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ముందుగా పార్టీ సెక్రటరీ జనరల్ ఎంపీ కే. కేశవరావు ప్రసంగంతో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేసిన క్రమాన్ని వివరించారు. భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేయగలిగామన్నారు. అదే పంథాలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని అన్నారు. అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలని చెప్పారు. మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటామన్న ఆయన... మార్క్ ఫెడ్ కు ఈ మేరకు ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందని అన్నారు. "పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలి. క్యాడర్ లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టండి.షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తాం. బాగా పనిచేసిన వారికే టికెట్లు ఇస్తాం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టం. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశం. ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్... బట్ బై చాయిస్. దూపయినప్పుడు బావి తవ్వుతాం అనే రాజకీయం నేడు కాలానికి సరిపోదు. బీఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టివి యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టవచ్చు.అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టివి ఛానల్ ను కూడా నడపవచ్చు" అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

WhatsApp channel

సంబంధిత కథనం