ఇక 360 డిగ్రీల్లో నిఘా.. ఫిబ్రవరిలో హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ ప్రారంభం?-cm kcr to inaugurate the telangana police command control center in february ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇక 360 డిగ్రీల్లో నిఘా.. ఫిబ్రవరిలో హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ ప్రారంభం?

ఇక 360 డిగ్రీల్లో నిఘా.. ఫిబ్రవరిలో హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ ప్రారంభం?

Manda Vikas HT Telugu

రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో తేలిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ, ఏ సమయంలో ఏం జరుగుతుందో 'రియల్ టైమ్' వీక్షణలో చూడవచ్చు. అత్యాధునిక టెక్నాలజీతో, అనేకమైన సౌకర్యాలతో రూపుదిద్దుకున్న తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్

కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC) భవనం- హైదరాబాద్ (Twitter)

Hyderabad | తెలంగాణ రాష్ట్రానికి మరో మణిపూసగా, హైదరాబాద్ నగరానికి మకుటంగా నిలుస్తున్న హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC) భవనం త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. బంజారాహిల్స్‌ రోడ్‌ 12లో ఏర్పాటు చేయనున్న ఈ పోలీస్‌ కమాండ్‌- కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణ స్థితిగతులపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ పనులేమైనా ఉంటే ఫిబ్రవరి 15లోగా మొత్తం పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్‌ గణపతిరెడ్డి, అడిషనల్‌ సీపీ హైదరాబాద్‌ పోలీస్‌ డీఎస్‌ చౌహాన్‌, ఎన్‌ఐటీ వరంగల్‌ డైరెక్టర్‌ ఎన్‌వీ రమణారావు, హైదరాబాద్ మెట్రో రైల్ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సాయి సహా ఇతర కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ పనులను పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు, ఎక్కడెక్కడ పనుల ఆలస్యం జరుగుతుందో తెలుసుకుంటూ ముఖ్యమంత్రి విధించిన గడువుకంటే ముందే సర్వం సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ప్రధాన కమాండ్‌ కంట్రోల్‌ని ఫిబ్రవరి నెలలోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ కమాండ్ కంట్రోల్ భవన సముదాయానికి ప్రజలే ఒక మంచి పేరు సూచించాలంటూ సీవీ ఆనంద్‌ కోరారు.

తెలంగాణలో ప్రతి అంగుళంపై నిఘా

ఈ భవనం అందుబాటులోకి వస్తే తెలంగాణలోని ప్రతి అంగుళం 360 డిగ్రీల పోలీసు రాడార్‌ పర్యవేక్షణలో ఉంటుంది. రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో తేలిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలన్నీ ఈ సెంటర్‌తో అనుసంధానం చేయడం వలన అధికారులు ఎక్కడ, ఏ సమయంలో ఏం జరుగుతుందో 'రియల్ టైమ్' వీక్షణలో చూడవచ్చు. ఇందుకోసం కొరియన్ టెక్నాలజీని ఉపయోగించి భారీ సర్వర్లను అమర్చినట్లు తెలిసింది.  

సుమారు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భారీ టవర్లలో నాల్గవ, ఏడవ అంతస్తుల మధ్యన కమాండ్ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఇందులో సర్వర్ రాక్‌లు, నిఘా కెమెరా ఫుటేజీని పర్యవేక్షించడానికి డబుల్ సైజ్ వీడియో కాల్ సౌకర్యం, వార్ రూంతో పాటు ఇతర అనేక సౌకర్యాలు ఉన్నాయి.

ఫీల్డ్ పోలీసింగ్‌కు మద్దతుగా బ్యాక్-ఎండ్ ఆపరేషన్‌లలో పనిచేసే సాంకేతిక బృందాలు ఇక్కడ్నించే పర్యవేక్షిస్తారు, సూచనలు ఇస్తూ ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖలను ఇక్కడ్నించే సమన్వయం చేసుకోలగడమే కాకుండా ఒక డిజాస్టర్, క్రైసిస్ మేనేజ్‌మెంట్ సెంటర్‌గా కూడా ఇది పని చేస్తుంది.

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం కోసం అన్ని ప్రభుత్వ శాఖల నుండి క్రాస్-ఫంక్షనల్ టీమ్‌లను ఈ కమాండ్ సెంటర్ కలిగి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సోషల్ మీడియా యూనిట్లతో పాటు పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రవేశపెట్టిన ఇతర టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలు ఇక్కడ్ని నుంచే నిర్వహించబడతాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నట్లుగా అత్యుత్తమ సాంకేతికత వ్యవస్థ ఈ కమాండ్ సెంటర్ లో ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పోలీసు శాఖకు సంబంధించిన ఏడు ఎకరాల స్థలంలో 20 అంతస్తులతో ఒకటి, మిగిలిన మూడు 16 అంతస్తులతో మొత్తం నాలుగు టవర్‌ల నిర్మాణం చేపట్టారు. ఈ సెంటర్ నిర్మాణం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చించింది. తొలుత రూ. 350 కోట్లు, తర్వాత మరో రూ. 200 కోట్లు కేటాయించినట్లు పలు నివేదికలు తెలిపాయి.

 

సంబంధిత కథనం