CM KCR : 10 శాతం గాంధీ స్ఫూర్తి నింపుకొన్నా దేశం పురోగమిస్తుంది-cm kcr speech in independence diamond jubilee celebrations closing ceremony at lb stadium ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Speech In Independence Diamond Jubilee Celebrations Closing Ceremony At Lb Stadium

CM KCR : 10 శాతం గాంధీ స్ఫూర్తి నింపుకొన్నా దేశం పురోగమిస్తుంది

HT Telugu Desk HT Telugu
Aug 22, 2022 09:45 PM IST

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను గొప్పగా జరుపుకొన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో మహాత్మాగాంధీ గురించి, స్వతంత్ర పోరాటంలో ఆయన పాత్రపై నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో అమూల్యమైన త్యాగాలు, బలిదానాలు జరిగితేనే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ముగింపు ఉత్సవాలకు సీఎం కేసీఆర్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా ఎల్బీ స్టేడియానికి వచ్చిన సీఎం.. మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను గొప్పగా జరుపుకొన్నామని కేసీఆర్ అన్నారు. అహింసా మార్గం ద్వారా ఎంతటి శక్తిమంతులనైనా జయించవచ్చని ప్రపంచ మానవాళికి సందేశమిచ్చిన మహాత్మా గాంధీ పుట్టిన గడ్డ మన దేశం అని గుర్తు చేశారు. ఇలాంటి దేశంలో మహాత్మాగాంధీ గురించి, స్వతంత్ర పోరాటంలో ఆయన పాత్రపై నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు.

స్వాతంత్య్రం ఊరికే రాలేదని, ఎన్నో అమూల్యమైన త్యాగాలు, బలిదానాలు జరిగితేనే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని కేసీఆర్ అన్నారు. స్వేచ్ఛా భారతంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నామని చెప్పారు. ఎలాంటి ఘటన జరిగినా.. 75 ఏళ్లుగా స్వతంత్ర భారతంలో జరుగుతున్న విషయాలను గుర్తుచేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పారు. ముఖ్యంగా యువకులు, మేధావులు, ఆలోచనాపరులు ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. చూస్తూ మౌనం వహించడం సరైంది కాదన్నారు.

'దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసే కుటిల ప్రయత్నాలను చూస్తూ మేథావులు మౌనం వహించరాదు. దేశం సరైన రీతిలో పురోగమించేలా సక్రమరీతిలో ప్రయాణించేలా వైతాళికులు కరదీపికలుగా మారాలి. ఇప్పటికీ దేశంలో పేదల ఆశలు నెరవేరని పరిస్థితులు ఉన్నాయి. అడుగు వర్గాల ప్రజల్లో ఆక్రోశం వినిపిస్తోంది. అనేక వర్గాల ప్రజలు మాకు స్వాతంత్ర్య ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని విస్మరించి దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేందుకు కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. మౌనం వహించడం సరికాదు. అర్థమై కూడా అర్థం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు. ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తామో.. ఆ సమాజం గొప్పగా పురోగమించేందుకు వీలుంటుంది.' అని కేసీఆర్ అన్నారు.

అద్భుతమైన వనరులు ఉన్న ఈ దేశం అనుకున్న విధంగా పురోగమించడం లేదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ స్వాతంత్ర్యం మనకు ఊరికే లభించలేదని మరోసారి గుర్తు చేశారు. కులం, మతం, జాతి అనే భేదం లేకుండా పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రతి ఇంట్లో స్ఫూర్తి రగిలేలా రోజుకో కార్యక్రమం చేపట్టామని కేసీఆర్ అన్నారు.

కోటి మందితో సామూహిక జాతీయ గీతాలాపన తెలంగాణకే గర్వకారణమని సీఎం కొనియాడారు. కొందరు అల్పులు గాంధీ గురించి నీచంగా మాట్లాడవచ్చ అని.. గాంధీ సినిమాను 22 లక్షల మంది చూడడం గొప్ప విషయమని కేసీఆర్ అన్నారు. 10 శాతం గాంధీ స్ఫూర్తి నింపుకొన్నా దేశం పురోగమిస్తుందని వ్యాఖ్యానించారు. గాంధీజీ గురించి ఈతరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మర్చిపోకూడదని చెప్పారు.

IPL_Entry_Point