KCR Meets Kumaraswamy : కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరం-cm kcr meets hd kumaraswamy on national politics ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Cm Kcr Meets Hd Kumaraswamy On National Politics

KCR Meets Kumaraswamy : కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరం

కుమారస్వామితో కేసీఆర్
కుమారస్వామితో కేసీఆర్

KCR National Politics : ముఖ్యమంత్రి.. కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ప్రధానంగా జాతీయ రాజకీయాలపై చర్చించారు.

సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి.. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ ప్రగతిభవన్ లో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న కుమారస్వామికి, సీఎం కేసీఆర్‌ స్వయంగా స్వాగతం పలికారు. ఆయనతోపాటుగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, ఎస్.రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

కేసీఆర్ అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశానికి ఎంతో అవసరం ఉందని.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ దేశం గర్వించే రీతిలో తెలంగాణను ప్రగతి పథాన నడుపుతున్న కేసీఆర్.. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేయాలన్నారు. అందుకు తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమారస్వామి తెలిపారు. సీఎం కేసీఆర్, త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కుమారస్వామి స్వాగతించారు. వర్తమాన జాతీయ రాజకీయాల్లో, దేశ పాలనలో ప్రత్యామ్న్యాయ శూన్యత నెలకొన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వంటి సీనియర్ లీడర్ ఆవశ్యకత దేశానికి అత్యవసరమని కుమారస్వామి అభిప్రాయపడ్డారు.

ఈ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ తో కుమారస్వామి సుదీర్ఘంగా చర్చించారు. తమ నడుమ అర్థవంతమైన చర్చ సాగిందని కుమారస్వామి తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ అలుపెరగకుండా సాగించిన ఉద్యమం, శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అదే పద్ధతిలో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న తీరుపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది.

దేశానికి తెలంగాణ మోడల్ అవసరం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 8 ఏళ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూసి, దేశమంతా చర్చిస్తున్నదని కుమారస్వామి అన్నారు. తమకూ ఈ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నామన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, తాగునీరు, సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు, తదితర పథకాలపై కేసీఆర్ తో కుమారస్వామి మాట్లాడారు. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అనతి కాలంలోనే ప్రశంసలు అందుకుందన్నారు. దేశానికి తెలంగాణ మోడల్ అవసరముందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీజేపీ ముక్త్ భారత్ కోసం సమిష్టి కృషి..

దేశంలో, విచ్ఛిన్నకర పాలన ధోరణులు రోజు రోజుకు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల నడుమన విభజన సృష్టించే కుట్రలను సమిష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాట్లాడమని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని మత విద్వేషపు ప్రమాదకర అంచుల్లోకి నెట్టకుండా కాపాడుకుంటామని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరముందని ఇరువురు నేతలు అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశ గుణాత్మక ప్రగతికోసం తన వంతు సహకారాన్ని అందించాలని, అందుకోసం రాజకీయ పార్టీని స్థాపిస్తే తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమార స్వామి తెలిపారు.

బీజేపీకి ప్రత్యామ్నయంగా విఫలమైన కాంగ్రెస్..

బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అనే అభిప్రాయం దేశ ప్రజల్లో సన్నగిల్లిందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై దేశ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితులే నేడు కనిపిస్తున్నాయన్నారు. ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తి ఫరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత నేటి దేశ రాజకీయలకు తక్షణావసరమని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ వ్యాప్తంగా ఒత్తిడి

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, తెలంగాణ మాదిరిగానే దేశాన్ని కూడా నడిపించాలని తనపై రోజురోజుకూ వత్తిడి పెరుగుతుందన కేసీఆర్ చెప్పారు. ప్రగతిపథంలో నడుస్తున్న తెలంగాణను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూ అనేకరకాలుగా ఆటంకాలు సృష్టిస్తున్న బీజేపీపై ప్రజలు పూర్తి వ్యతిరేక ధోరణితో ఉన్నారని అన్నారు. చివరకు టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా గ్రామస్థాయి నుంచీ, జిల్లా, రాష్ట్ర స్థాయి అధ్యక్ష, కార్యదర్శివర్గాలు కూడా జాతీయ పార్టీని స్థాపించి, బీజేపీని ఇంటికి సాగనంపాలని ముక్తకంఠంతో తీర్మానాలు చేస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు.

దేశంలో రైతు రాజ్యం రావాలె

వ్యవసాయాధారిత భారతదేశంలో తెలంగాణలో మాదిరిగానే రైతులకు ఇస్తున్న నిరంతర విద్యుత్ తదితర ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, రైతు రుణాల మాఫీ, సహా వ్యవసాయ అభివృద్ధి పథకాలన్నింటినీ దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చని సీఎం కేసీఆర్ వివరించారు. ఈ దిశగా 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేతల నిర్లక్ష్యంపై ఇద్దరు నేతలు చర్చించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తూ, దేశీయ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు బీజేపీ పాల్పడుతోందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగాన్నే కాకుండా ఆర్థిక, సామాజిక తదితర అన్నిరంగాలను అధోగతిపాలు చేస్తూ రోజురోజుకూ బీజేపీ పార్టీ దిగజారిపోతున్నదని విమర్శించారు.

WhatsApp channel