Pension Hike : ఆసరా పెన్షన్లపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి వారికి
CM KCR On Aasara Pensions: వికలాంగులకు తీపి కబురు చెప్పారు సీఎం కేసీఆర్. దశాబ్ధి ఉత్సవాల వేళ ప్రస్తుతం అందిస్తున్న రూ. 3వేల పింఛన్ ను రూ. 4 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
Aasara Pensions in Telangana: మంచిర్యాల సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఆసరా పెన్షన్లలో భాగంగా వికలాంగులకు ఇస్తున్న 3,116 పెన్షన్ ను రూ. 4,116కు పెంచుతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల నుంచి పెరిగిన పెన్షన్లను అందజేస్తామని తెలిపారు. దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఈ తీపి కబురు చెబుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కేసీఆర్… కొత్త కలెక్టరేట్ ను ప్రారంభించారు. సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్… ఆసరా పెన్షన్లపై కీలక ప్రకటన చేశారు. అవ్వ - తాతలకు 2 వేల పింఛన్ అందుతుందని.. ఎవరిపై ఆధారపడకుండా బ్రతుకుతున్నారని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ఏకైక రాష్ట్రం మనదే - సీఎం కేసీఆర్
విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 24 గంటల పాటు రైతులకు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. 'దేశంలో 150 సంవత్సరాలకు విద్యుత్ ఇచ్చే అంత బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ... ఆ దిశగా ప్రయత్నాలు జరగటం లేదు. ఇలాంటి వాటి పట్ల మనమంతా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ తెలంగాణలో ధరణి తీసుకువచ్చాం. ఎలాంటి పైరవీలు లేకుండా ఇవాళ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రైతుబీమా పేరుతో ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇందుకు దరఖాస్తు కూడా అవసరం లేదు. కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోవాలి. అపద్బాందు కింద కేవలం 50 వేల ఇచ్చేవారు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నాం. సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయలను రైతు బంధు రూపాయల రూపంలో ఇస్తున్నాం. నేరుగా వచ్చి మీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇవన్నీ కూడా పారదర్శకంగా జరుగుతున్నాయంటే కారణం ధరణి. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.గతంలో ఉన్న ఇబ్బందులు లేవు. వడ్ల అమ్మిన వెంటనే ఐదారు రోజుల్లో డబ్బులు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలు ఉంటే.. ఇవాళ 70 పైగా చేరాయి. రిజిస్ట్రేషన్ల ఆఫీసులు పెంచామని ముఖ్యమంత్రి వివరించారు.
ధరణిని రద్దు చేస్తామని కొన్ని పార్టీలు చెబుతున్నాయని కేసీఆర్ దుయ్యబట్టారు. అలా చెబుతున్న పార్టీలు పొరపాటున అధికారంలోకి వస్తే... రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అందుతాయా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. ధరణితో గట్టు పంచాయితీలు లేవని చెప్పారు. "ధరణి పోతే దళారీల రాజ్యం వస్తది. పోలీసులు, కోర్టుల చుట్టు తిరిగే వస్తది. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్న వారినే అందులో వేయాలి" అని పిలుపునిచ్చారు. ధరణి ఉండాలా వద్దా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.