Gruha Lakshmi : గృహలక్ష్మి కింద రూ. 3 లక్షలు.. అన్ని రకాల స్థలాల్లో ఇళ్లు కట్టుకునే అవకాశం-cm kcr issues guidelines to mla on welfare schemes along with gruha lakshmi programme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Issues Guidelines To Mla On Welfare Schemes Along With Gruha Lakshmi Programme

Gruha Lakshmi : గృహలక్ష్మి కింద రూ. 3 లక్షలు.. అన్ని రకాల స్థలాల్లో ఇళ్లు కట్టుకునే అవకాశం

HT Telugu Desk HT Telugu
Mar 10, 2023 10:17 PM IST

Gruha Lakshmi : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అమలయ్యేలా చూడాలని.. అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులని ఆదేశించారు.

బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం (twitter)

Gruha Lakshmi : తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే ముందు వరుసలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పసిపిల్లలు, ముసలివాళ్ల నుంచి ఆడబిడ్డలు వరకు, రైతన్నల నుంచి ఐటి, పరిశ్రమల వరకు ప్రతీ రంగంలో సంక్షేమం, అభివృద్ధి సాధిస్తూ రాష్ట్రం నేడు సమ్మిళితాభివృద్ధిని సాధించిందన్నారు. విదేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోందని... రాష్ట్ర పారిశ్రామిక విధానాలను ప్రపంచం మెచ్చుకుంటోందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పలు కార్పోరేషన్ల ఛైర్మన్ లు, మేయర్ లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల మరణించిన పార్టీ ఎమ్మెల్యే బండి సాయన్న చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.... అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని బీజేపీ పార్టీ ఓర్వలేకపోతోందన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఈ దేశం నుంచి బిజెపి పార్టీని పారద్రోలేవరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 14న బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని... ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభోత్సవం జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఏప్రిల్ 25న పార్టీ జెండాల ఆవిష్కరణ... ఏప్రిల్ 27న ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభ నిర్వహిస్తామని వివరించారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభను... అక్టోబర్ లో వరంగల్ లో సభను నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అమరవీరుల జ్యోతిని జూన్ 1న ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనంతరం ఇంకా మిగిలి ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీని పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 58,59 జీవోల ప్రకారం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం లబ్దిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలే ప్రతిపాదనలు చేసి సంబంధిత కలెక్టర్లకు పంపించాలని.. ఎమ్మెల్యేల ప్రతిపాదనలను అనుసరించి కలెక్టర్లు లబ్దిదారుల ఎంపికను పూర్తి చేసి, వారికి నిబంధనల ప్రకారం దళితబంధు ప్రయోజనాన్ని కల్పిస్తారని పేర్కొన్నారు. దళితబంధు నిధుల విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా లబ్దిదారులకు నిధులు అందేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని చెప్పారు.

గృహలక్ష్మి పథకం గైడ్ లైన్స్...

సొంత జాగాలో ఇండ్ల నిర్మాణానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను స్థానిక ఎమ్మెల్యేలు సిద్ధం చేసి కలెక్టర్లకు పంపించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించి, వారికి గృహలక్ష్మి పథకం కింద భార్య పేరు మీదుగా రిజస్ట్రేషన్ చేసి బ్యాంకు ఖాతాల్లో మూడు దశల్లో, ప్రతీ దశలోనూ లక్ష రూపాయల చొప్పన బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని వివరించారు. నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు చొప్పున మంజూరు చేయడం జరుగుతుందని... లబ్దిదారునికి ప్రభుత్వం ఇచ్చిన భూమి అయినా, పట్టా భూమి అయినా, అన్ని రకాల స్థలాల్లో ఇళ్లు కట్టుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని కేసీఆర్ వివరించారు.

గృహలక్ష్మి పథకాన్ని భార్య పేరు మీద అమలుచేస్తున్నందున, భర్త పేరు మీద భూమి ఉన్నట్లయితే భార్య పేరు మీదకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు కేసీఆర్. పునాది సమయంలో లక్ష రూపాయలు, స్లాబు వేసిన అనంతరం లక్ష రూపాయలు, చివరగా నిర్మాణం పూర్తయి సున్నాలు వేసిన దశలో లక్ష రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాలు, నియమ నిబంధనలను అనుసరించి అవినీతికి ఎటువంటి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనని స్పష్టం చేశారు. పేదలకు అందే పథకాల్లో అవినీతి జరిగితే క్షమించే ప్రసక్తే లేదని.... ఇది ఎమ్మెల్యేల భవిష్యత్తు పై ప్రభావం చూపుతుందని.. కాబట్టీ జాగ్రత్తగా వ్యవహరించాలని కేసీఆర్ హెచ్చరించారు.

ప్రభుత్వం రెండవ దశ గొర్రెల పంపిణీనిన ప్రారంభిస్తున్న నేపథ్యంలో అవినీతి లేకుండా లబ్దిదారులకు ప్రయోజనం అందేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదనన్నారు సీఎం కేసీఆర్. ఇందుకు సంబంధించిన విధివిధానాలను తూచ తప్పకుండా అమలుచేస్తూ మే, జూన్ కల్లా పూర్తి చేయాలని... 3.5 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం పోడు భూముల పంపిణీ త్వరలో ప్రారంభిస్తుందన్నారు. అర్హులకు అందరికీ న్యాయం జరిగేలా చూసుకుంటూ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు జాగ్రత్తగా జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

IPL_Entry_Point