CM KCR : పోడు భూములకు రైతుబంధు... ఈ సీజ‌న్ నుంచే అందించాలన్న సీఎం కేసీఆర్-cm kcr inaugurated new collectorate complex in nirmal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Inaugurated New Collectorate Complex In Nirmal

CM KCR : పోడు భూములకు రైతుబంధు... ఈ సీజ‌న్ నుంచే అందించాలన్న సీఎం కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Jun 04, 2023 06:26 PM IST

CM KCR Nirmal Tour Updates: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించారు. కొత్త కలెక్టరేట్ భవనంతో పాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇక నిర్మల్ జిల్లాకు వరాలు ప్రకటించారు సీఎం కేసీఆర్.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

CM KCR Latest News: ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన మొదలైంది. ఇందులో భాగంగా ఇవాళ నిర్మల్ జిల్లాలో పర్యటించారు. హైద‌రాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా నిర్మ‌ల్ కు చేరుకున్న ఆయన… నిర్మ‌ల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు భ‌వ‌నాన్ని తొలుత ప్రారంభించారు. అనంతరం నిర్మ‌ల్ జిల్లా స‌మీకృత క‌లెక్టరేట్ భ‌వనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సీటులో వరుణ్‌ రెడ్డిని కూర్చొబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్…. ఇవాళ ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా విభ‌జింప‌బ‌డి ప‌రిపాల‌న ప్ర‌జ‌ల‌కు చేరువైందన్నారు. 4 జిల్లాల‌కు మెడిక‌ల్ కాలేజీలు వ‌స్తున్నాయని…. ఆసిఫాబాద్ లాంటి అడ‌వి ప్రాంతంలో కూడా మెడిక‌ల్ కాలేజీ వ‌చ్చిందని వ్యాఖ్యానించారు. పోడు భూముల పంపిణీని బ్ర‌హ్మాండంగా నిర్వ‌హించాలని సూచించారు. ఈ సీజ‌న్ నుంచే రైతుబంధు అందించాలని… పంపిణీ తర్వాత వెంటనే వారి బ్యాంకు ఖాతాలు సేక‌రించాలన్నారు.

రాష్ట్రంలో చేయాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఉందన్నారు కేసీఆర్. ఎన్నికల తర్వాత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తరతరాలుగా అణచివేయబడుతున్న దళితులు, గిరిజనులు, అగ్ర వర్ణాల్లో పేదలు వెనుకబడి ఉన్నారని.... ఇదే పట్టుదల, కృషితో ముందుకు సాగితే అందరినీ సమాన స్థాయికి తెచ్చే పరిస్థితి ఉంటుందని తెలిపారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత మ‌నంద‌రం క‌లిసి పని చేశామని.. స‌మిష్టి కృషితో అద్భుత ఫ‌లితాలు సాధించ‌గ‌లిగామని చెప్పుకొచ్చారు. ప‌వ‌ర్ ప‌ర్ క్యాపిట‌లో నంబ‌ర్ వ‌న్ లో ఉన్నామని…. ముఖ్రా కే గ్రామం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

నిర్మల్ కు వరాల జల్లు…

కలెక్టరేట్ ప్రారంభం అనంత‌రం ఎల్ల‌పెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రగతిని వివరించారు. ఇక నిర్మల్ జిల్లాకు వరాలు ప్రకటించిన కేసీఆర్… జిల్లాలోని గ్రామ పంచాయ‌తీల‌కు, మండ‌ల కేంద్రాల‌కు, మున్సిపాలిటీల‌కు భారీగా నిధులు మంజూరు చేశారు.పంచాయ‌తీల‌కు ప్ర‌త్యేకంగా రూ. 10 ల‌క్ష‌ల చొప్పున నిధులు ప్రకటించారు. ఇక నిర్మ‌ల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీల‌కు రూ. 25 కోట్ల చొప్పున ఇస్తామని… జిల్లాలోని 19 మండ‌ల కేంద్రాల‌కు రూ. 20 ల‌క్ష‌ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం అని కేసీఆర్ ప్ర‌క‌టించారు.ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. పదో తరగతి ఫలితాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన సందర్భంగా నిర్మల్ జిల్లా విద్యార్థులు, ఉపాధ్యాయులను కేసీఆర్ అభినందించారు. దుర్మార్గులు మళ్లీ వస్తే రైతుబంధుకు రాం రాం పలికే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. త్వరలోనే గృహలక్ష్మి, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.

ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్‌ అవాకులు చవాకులు పేలుతోందని మండిపడ్డారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్‌ వాళ్లు చెబుతున్నారని.. అలా చెబుతున్న వారినే బంగాళా ఖాతంలో పడేయాలని ధ్వజమెత్తారు.

WhatsApp channel