CM KCR Jagtial Tour : ఏదీ మేక్ ఇన్ ఇండియా.. చైనా నుంచి వచ్చుడా?-cm kcr comments on telangana development in jagtial ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Comments On Telangana Development In Jagtial

CM KCR Jagtial Tour : ఏదీ మేక్ ఇన్ ఇండియా.. చైనా నుంచి వచ్చుడా?

HT Telugu Desk HT Telugu
Dec 07, 2022 06:46 PM IST

CM KCR Comments : అందరికీ ప్రయోజనాలు అందేలా పథకాలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు చాలా అనిశ్చిత పరిస్థితి ఉందని గుర్తు చేశారు.

జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

జగిత్యాలలో సీఎం కేసీఆర్(CM KCR) పర్యటించారు. కలెక్టరేట్ భవనంతోపాటుగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రమవుతుందని ఆనాడే చెప్పానని కేసీఆర్ అన్నారు. అందరికీ ప్రయోజనాలు అందేలా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. క్రమక్రమంగా అన్నీ అర్థం చేసుకుని అంచనా వేసుకున్నామన్నారు. నేడు ఎన్నో అంశాల్లో అని రాష్ట్రాల కంటే ముందున్నామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

‘దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశానికే ఆదర్శంగా నిలిచే ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. గురుకుల విద్యాలయాల్లో తెలంగాణకు పోటీయే లేదు. కేంద్రం సహకరించకున్నా 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం.’ అని కేసీఆర్ అన్నారు.

ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్(CS Somesh Kumar) మాట్లాడారు. 2014కు ముందు 107 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండేవన్నారు. ఇవాళ 700కు పైగా చోట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్(CM KCR) ఎన్నో చేశారన్నారు. పదోన్నతి కాల పరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారన్నారు. ఎన్నో ఏళ్లుగా రాని పదోన్నతలు ఇప్పుడు వచ్చాయని చెప్పారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చర్యలు తీసుకున్నారన్నారు. సీఎం ఆశయాలకు తగ్గట్టుగానే ఉద్యోగులు కృషి చేస్తున్నారని సీఎస్ అన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ముందుగా తెలంగాణ(Telangana)లో జరుగుతున్న పనులు, పథకాలు, అభివృద్ధిపై మాట్లాడారు. ఆ తర్వాత కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మన చుట్టూ.. గోల్ మాల్ గోవిందంగాళ్లు చేరారని విమర్శించారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ఇన్నేళ్ల మోదీ(Modi) పాలనలో ఒక్క మంచిపనైనా జరిగిందా అని ప్రశ్నించారు.

మేకిన్ ఇండియా(Make In India) అని చెప్పడమే తప్పా.. ఎక్కడ ఉందని కేసీఆర్ ప్రశ్నించారు. చైనా నుంచి వస్తువులు రావడం మేక్ ఇన్ ఇండియానా అని అడిగారు. టపాసులు, దీపం వత్తులు, చివరికి భారతీయ జెండాలు కూడా చైనా నుంచి వస్తున్నాయని చెప్పారు. మోదీ దేశ సంపదను కార్పొరేట్ల చేతిలో పెడుతున్నారని విమర్శించారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్(Gujarat)లో విద్యుత్ సరిపడా లేదన్నారు. దేశ రాజధానిలో కరెంట్ కోతలు ఉన్నాయన్నారు.

'చిన్న పొరపాటుతో 60 ఏళ్లు నష్టపోయిన చరిత్ర మనది. మరోసారి జాగ్రత్త పడకుంటే నష్టపోతాం. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేయాలని మోదీ కుట్ర చేస్తున్నారు. మోదీ పార్టీకి నిధులిచ్చే.. వ్యాపారుల చేతిలో విద్యుత్ రంగాన్ని పెడుతున్నారు. వ్యాపారులు బాగుపడి రైతులు భిక్షమెత్తుకునేలా చేస్తున్నారు.' అని కేసీఆర్ అన్నారు.

IPL_Entry_Point