TG Teachers Transfers: ఉపాధ్యాయ దంపతుల బదిలీలకు సీఎం అమోదం, డిఎస్సీ 2008 అభ్యర్థులకు టైమ్ స్కేల్ పోస్టింగ్
TG Teachers Transfers: తెలంగాణలో దంపతులైన ఉపాధ్యాయులకు సర్కారు తీపి కబురు చెప్పింది. జీవో నంబర్ 317తో నష్టపోయిన ఉపాధ్యాయులకు మేలు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. 2008డిఎస్సీ అభ్యర్థులకు టైమ్ స్కేల్‌తో ఉద్యోగాలు ఇస్తారు.
TG Teachers Transfers: తెలంగాణలో ఉపాధ్యాయ దంపతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉపాధ్యాయ బదిలీల్లో తీవ్ర ఆందోళనలకు కారణమైన దంపతుల బదిలీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో ఉపాధ్యాయులైన భార్యాభర్తల బదిలీలు, డీఎస్సీ-2008 అభ్యర్థుల పోస్టింగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆమోదం తెలిపారు. 317 జీవో వల్ల వేర్వేరు జిల్లాలకు బదిలీ కావడంతో భార్యాభర్తలను ఇకపై ఒకే జిల్లాకు కేటాయించేందుకు మంత్రివర్గ ఉపసంఘం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 840 మంది టీచర్లు ఒకే జిల్లాలో పనిచేసేందుకు అనుమతించాలని దరఖాస్తు చేశారు.
ఉపాధ్యాయుల జాబితాతో కూడిన దస్త్రాన్ని ఇటీవల విద్యాశాఖ సీఎంకు పంపిం చగా ఆయన దానికి ఆమోదం తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో సాధారణ పరిపాలన, విద్యాశాఖలు ఉపాధ్యాయుల బదిలీలపై జీవోలు విడుదల చేయనున్నాయి. దందపతులైన ఉపాధ్యాయుల బదిలీల ఫైల్‌కు ముఖ్యమంత్రి అమోదం తెలపడంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఉపాధ్యాయుల బదిలీ వ్యవహారం గత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. దీనిపై ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనలు సైతం నిర్వహించారు.
వారికి కాంట్రాక్టు ఉద్యోగాలు…
డీఎస్సీ-2008లో ఉద్యోగాలు దక్కక నష్టపోయిన అభ్యర్థులకు మినిమం టైమ్ స్కేల్‌తో ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లో ఉద్యోగాలు దక్కని వారిలో మొత్తం 2,367మంది బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక కారణాలతో అప్పట్లో ఉద్యోగాలు రాని వారికి ప్రభుత్వం కాంట్రాక్టు విధానంలో మినిమం టైమేస్కేల్ ఇచ్చేలా 2023 సెప్టెంబరు 24న నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే అర్హులైన అభ్యర్థులు ధ్రువపత్రాలను పరిశీలించి కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పని చేసేందుకు సమ్మతి ఇవ్వాలని విద్యాశాఖ సూచించింది. దీనికి దాదాపు 1,800మంది సానుకూలంగా స్పందించారు. వీరందరికి త్వరలో పోస్టింగులు ఇచ్చేందుకు విధివిధానాలు ఖరారు చేసే ఫైల్‌కు గురువారం సీఎం రేవంత్ రెడ్డి అమోదం తెలిపారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కనీస వేతనాలు చెల్లిస్తారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగిసేలోగా నియామకాలు పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. కాంట్రాక్టు ఉపాధ్యాయులకు అసవరమైన శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించే ఆలోచన చేస్తున్నారు.