Warangal : సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి ప్లాన్ - నగల కోసం క్లాస్ మేట్ ను హత్య చేసిన డెలివరీ బాయ్-classmate killed by delivery boy for jewelery in warangal district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Classmate Killed By Delivery Boy For Jewelery In Warangal District

Warangal : సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి ప్లాన్ - నగల కోసం క్లాస్ మేట్ ను హత్య చేసిన డెలివరీ బాయ్

HT Telugu Desk HT Telugu
Mar 31, 2024 10:01 AM IST

Warangal District Crime News: నగల కోసం క్లాస్ మేట్ ను హత్య చేశాడు ఓ డెలివరీ బాయ్. సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసును వరంగల్ జిల్లా పోలీసులు చేధించారు.

సుప్రియ(హత్యకు గురైన యువతి)
సుప్రియ(హత్యకు గురైన యువతి)

Warangal Crime News: హైదరాబాద్ లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్న ఓ యువకుడు తాను సహజీవనం చేస్తున్న ఓ మహిళతో కలిసి నగల కోసం చిన్ననాటి క్లాస్ మేట్ ను హత్య చేశాడు. ఇద్దరూ కలిసి ఆమెను హతమార్చి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకుని ఉడాయించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లిలో వారం రోజుల కిందట ఈ ఘటన జరగగా.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు కేసును ఛేదించారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

ట్రెండింగ్ వార్తలు

అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన తాటిపల్లి శశికాంత్, అదే జిల్లా మల్లంపల్లి మండలంలోని జంగాలపల్లికి చెందిన ఆకునూరి సుప్రియ(27) ఇద్దరూ కలిసి ఇంటర్మీడియట్ చదువుకున్నారు. శశికాంత్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటూ ఓ సంస్థలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. వివాహం కాకపోవడంతో హైదరాబాద్ లోనే ములుగు జిల్లాకు చెందిన అజ్మీరా శిరీష అనే వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. కాగా ఆకునూరి సుప్రియకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వెంగళ రాజ్ కిరణ్ తో 2016లో వివాహమైంది. రాజ్ కిరణ్ వరంగల్ నగరంలోని ఓ ఎలక్ట్రానిక్ షో రూంలో వర్క్ చేస్తుండగా.. వారికి కుమార్తె, కుమారుడున్నారు. ఇలా ఎవరి లైఫ్ వాళ్లు గడుపుతుండగా.. ఇంటర్మీడియట్ నుంచి స్నేహం కొద్ది ఇటీవల కొద్దిరోజుల కిందట సుప్రియ శశికాంత్ కు ఫోన్ చేసింది. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, హైదరాబాద్ లోని ఆసుపత్రుల గురించి వాకబు చేసింది. నెల రోజులుగా తరచూ ఫోన్ చేస్తూ హాస్పిటల్ల గురించి ఆరా తీస్తోంది.

నగల కోసం మర్డర్ కు ప్లాన్

తరచూ శశికాంత్, సుప్రియ ఫోన్ మాట్లాడుకుంటున్న విషయం సహజీవనం చేస్తున్న శిరీషకు తెలిసిపోయింది. దీంతో కొద్దిరోజుల నుంచి ఆమె శశికాంత్ తో వాగ్వాదానికి దిగుతోంది. తమ మధ్య చిచ్చు పెట్టొద్దంటూ కొద్దిరోజుల కిందట సుప్రియకు ఫోన్ చేసి కూడా మాట్లాడింది. ఈ క్రమంలోనే నెల రోజుల కిందట శశికాంత్, సుప్రియ ఇద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి మైసంపల్లికి వచ్చారు. నేరుగా సుప్రియ ఇంటికి వెళ్లి ఇంకోసారి తమకు ఫోన్ చేయొద్దని, హెచ్చరించి వెళ్లారు. వారు ఇద్దరూ వచ్చిన సమయంలో సుప్రియ ఒంటరిగానే ఉండగా.. ఆమె ఒంటిపై బంగారం ఉండటాన్ని శశికాంత్, శిరీష గమనించారు. తమ సహజీవనానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఎలాగైనా సుప్రియ నగలను కాజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సుప్రియను హతమార్చాలని పథకం వేసుకున్నారు.

గొంతు నులిమి దారుణ హత్య

ముందస్తు ప్లాన్ ప్రకారం శశికాంత్, శిరీష ఇద్దరూ సుప్రియ ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించి వెళ్లారు. ఆ తరువాత ఈ నెల 23న హైదరాబాద్ నుంచి మైసంపల్లికి మరోసారి బైక్ పై వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సుప్రియ ఇంటికి వచ్చి, ఆమెతో మాట్లాడారు. అప్పటికే ఆమె భర్త రాజ్ కిరణ్ ఉద్యోగం కోసం వరంగల్ కు వెళ్లగా.. శశికాంత్, శిరీష ఇద్దరూ సుప్రియతో మాట కలిపారు. శశికాంత్ తెలిసిన వ్యక్తే కావడంతో వారికి టీ పెట్టేందుకని సుప్రియ వంటగదిలోకి వెళ్లింది. ఆమె వెంటనే లోపలికి వెళ్లిన శశికాంత్, శిరీష తమ పథకంలో భాగంగా ఆమెపై దాడికి దిగారు. సుప్రియను తీవ్రంగా కొట్టి కింద పడేశారు. అనంతరం శిరీష సుప్రియ కాళ్లను గట్టిగా పట్టుకోగా.. శశికాంత్ గొంతు నులిమి ఆమెను హతమర్చారు. ఆ తరువాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు పుస్తెల తాడు, ఇంట్లో ఉన్న ఇతర బంగారు నగలతో బైక్ పై అక్కడి నుంచి పరారయ్యారు. హైదరాబాద్కు చేరుకుని అక్కడి ఏఎస్ రావు నగర్ లోని ఓ గోల్డ్ షాప్ లో పుస్తెలతాడు, ఇతర చైన్లు కరిగించి కొత్త నగలు చేయించుకున్నారు.

వారం రోజుల పాటు దర్యాప్తు

మార్చి 23న సుప్రియను గొంతు నులిమి హత్య చేయగా.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఎస్సైలు పరమేశ్, రఘుపతి ఆధ్వర్యంలో ముమ్మర దర్యాప్తు జరిపారు. సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా క్ల్యూస్ లభించగా.. పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే మిగిలిన ఆభరణాలు విక్రయించేందుకు శశికాంత్, శిరీష ఇద్దరూ శనివారం ఉదయం ఖానాపురం మండలంలోని తెలిసిన వారింటికి వెళ్తుండగా.. పోలీసులకు సమాచారం అందింది. ఆ మార్గంలో వాహనాల చెకింగ్ చేస్తుండగా.. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయడంతో వారి పట్టుకుని విచారించారు. దీంతో అసలు విషయాన్ని శశికాంత్, శిరీష ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుంచి నగలతో పాటు ఒక జత వెండి పట్టీలు, బైక్, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రవీందర్ వివరించారు.

రిపోర్టింగ్ - వరంగల్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు

IPL_Entry_Point