ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆన్ గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వరద నివారణ పనులు, ధాన్యం కొనుగోళ్లు, భద్రకాళి చెరువు సుందరీకరణపై సమీక్ష నిర్వహించేందుకు.. సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం హనుమకొండ జిల్లాకు వచ్చారు.
మంత్రులు హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్ లో నేరుగా దేవాదుల ప్రాజెక్టులో భాగంగా హసన్‌పర్తి మండలం దేవన్నపేట వద్ద నిర్మించిన పంప్ హౌజ్ ను పరిశీలించేందుకు వెళ్లారు. వారికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవన్నపేట ప్రాజెక్టు 3 పంప్ హౌజ్ వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ ఆఫీసర్లతో దేవాదుల ప్రాజెక్టు పనులపై రివ్యూ చేశారు.
ఇంటర్నల్ గా జరిగిన ఈ రివ్యూకు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లను తప్ప ఎవరినీ అనుమతించలేదు. ఇదిలాఉంటే రివ్యూ జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యేలు, ఇతర నేతల పీఏలంతా సైలెంట్ గా ఉండగా.. జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి పీఏ ఇంటర్నల్ రివ్యూను వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. పక్కనే ఉన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.. వీడియోలు, ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కాస్త పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదానికి దారి తీసింది.
రివ్యూ అనంతరం బయటకు వస్తున్న క్రమంలో.. ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఫొటోలు, వీడియోలు తీస్తుంటే అభ్యంతరం చెప్పడం ఎందుకని ఎమ్మెల్యే పల్లా ప్రశ్నించారు. ‘అదేమైనా దొంగ పనా.. లంగ పనా..?’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని కూడా ధీటుగానే స్పందించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వాదం చోటుచేసుకోగా.. పక్కనే ఉన్న మిగతా నేతలంతా సైలెంట్ గా వారి వెనకాలే మెట్లు దిగి బయటకు వచ్చేశారు. ఇద్దరు వ్యతిరేక పార్టీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం అక్కడికక్కడ టెన్షన్ వాతావరణం పుట్టించగా.. ఏం జరుగుతుందోననే కంగారు మిగతా నేతల్లో కనిపించింది. వాగ్వాదం అనంతరం ఎమ్మెల్యేలు ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్లిపోగా.. వారి మాటల యుద్ధానికి అంతటితో ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం