మామునూరు ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్ పోర్టు గురించి క్రెడిట్ ఫైట్ జరిగింది. వరంగల్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వేర్వేరుగా బీజేపీ, కాంగ్రెస్ సంబరాలు జరిపాయి. ఒకే సమయంలో ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు దగ్గరకు ఇరు పార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. పోటాపోటీగా ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ, రేవంత్ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు భారీగా మోహరించారు.
మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి ఆమోదం తెలుపుతూ.. కేంద్ర పౌర విమానయాన శాఖ శుక్రవారం (ఫిబ్రవరి 28న) ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమానయానం కల త్వరలోనే సాకారం కానుందని సంతోషపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఎయిర్‌పోర్ట్ వద్ద గొడవ జరగడం చర్చనీయాంశంగా మారింది.
మామునూరు విమానాశ్రయానికి సంబంధించి గతంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. దీని అభివృద్ధి కోసం నీరు, విద్యుత్తు, రహదారుల సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. అలాగే.. ఉడాన్ పథకంలో చేర్చేందుకు మామునూరు విమానాశ్రయానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను పంపాలని.. గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు.. అప్పటి ప్రభుత్వాన్ని కోరారు. కానీ సకాలంలో డీపీఆర్‌ను పంపకపోవడంతో.. ఉడాన్‌లో చేర్చలేదు.
ఇటీవల ఏఏఐ వరంగల్‌లో మట్టి నమూనాలు సేకరించింది. ఎయిర్‌పోర్ట్ విస్తరణకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఉడాన్‌లో చేర్చి ప్రస్తుత స్థలంలోనే విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని కోరింది. 150 కిలోమీటర్ల పరిధిలోనే మరో విమానాశ్రయం నిర్మాణానికి జీఎంఆర్ కూడా అనుమతినిచ్చింది. కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది.
ఈ నేపథ్యంలో.. భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లను కేటాయించింది. సీఎం అధ్యక్షతన పలుమార్లు సమీక్ష కూడా నిర్వహించారు. త్వరితగతిన అభివృద్ధి పనులు చేయాలని ఆదేశించారు. తాజాగా.. విమానాశ్రయ అభివృద్ధికి అనుమతినిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు.. కృతజ్ఞతలు చెప్పారు.