Gun Misfire : బీడీఎల్ లో గన్ మిస్ ఫైర్ - తలలోకి దూసుకెళ్లిన తూట, CISF జవాన్ మృతి
Gun Misfire in Sangareddy District: గన్ మిస్ ఫైర్ కావటంతో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని బీడీఎల్ పరిధిలో శనివారం జరిగింది.
రాత్రి పూట విధులు నిర్వహించి, ఇంటికి తిరిగి వస్తున్నా సమయంలో గన్ మిస్ ఫైర్ అయ్యి CISF జవాన్ చనిపోయాడు. ఈ విషాదకరమైన సంఘటన భానూర్ లో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీ (BDL) పరిధిలో శనివారం ఉదయం జరిగింది. మృతి చెందిన జవాన్ ను ఏపీకి చెందిన పెట్నికోట వెంకటేశ్వర్లు (32) గా గుర్తించారు.
ఒకటిన్నర సంవత్సరాలుగా వెంకటేశ్వర్లు సంగారెడ్డి జిల్లాలోని పఠాన్ చెరువు మండలంలోని భానూర్ గ్రామంలో ఉన్న BDL కంపెనీ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడే ఉన్న బీడీఎల్ టౌన్ షిప్ లో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. వెంకటేశ్వర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉన్న అవుకు మండలంలోని జునూతల గ్రామానికి చెందినవాడు.
2012లో ఉద్యోగానికి ఎంపిక.…
2012లో CISFలో జవాన్ గా వెంకటేశ్వర్లు ఎంపికయ్యాడు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు కంపెనీలలో గత 12 సంవత్సరాలుగా ఎంతో సంవర్ధవంతంగా విధులు నిర్వహించాడని తోటి ఉద్యోగులు గుర్తుచేసుకున్నారు.
శుక్రవారం విధులు నిర్వహించిన వెంకటేశ్వర్లు…. శనివారం ఉదయం బస్సు దిగుతుండగా తన దగ్గర ఉన్నINSAS ఆయుధం దురదృష్టవశాత్తు పేలింది. బులెట్ అతని గదమ కిందుగా తలలో నుండి బయటికి వెళ్ళింది. దీంతో అక్కడికక్కడే వెంకటేశ్వర్లు మృతి చెందాడు. ఈ ఘటనతో CISF జవాన్లు, BDL సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన భార్య లక్ష్మి దేవి ఫిర్యాదు మేరకు BDL భానూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తన భర్త మృతి పట్ల తనకు ఎటువంటి అనుమానం లేదని భార్య లక్ష్మీ తెలిపింది. ప్రమాదవశాత్తు తుపాకీ పేలిందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఉదయం లేవటంతోనే… బస్సు డ్రైవర్ రమేష్ వచ్చి తన భర్త మృతి విషయం తెలిపాడని ఆమె పేర్కొన్నారు. వెంకటేశ్వర్లు, లక్ష్మి దేవికి సాయి (9) అనే కుమారుడు, సాయి పల్లవి (8) అనే కూతురు ఉన్నారు. వెంకటేశ్వర్లు కు 2012 లో ఉద్యోగం లో చేరగా, పెద్దల సమక్షంలో తమ వివాహం 2014 లో జరిగిందని ఆమె తెలిపారు. పిల్లలు ఇద్దరు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో…. వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి,HT తెలుగు,