child selling racket: బాలల విక్రయ ముఠా గుట్టు రట్టు.. ఏపీ, తెలంగాణల్లోభారీగా విక్రయాలు, నిందితుల అరెస్ట్-child selling gang busted huge sales in ap and telangana accused arrested ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Child Selling Racket: బాలల విక్రయ ముఠా గుట్టు రట్టు.. ఏపీ, తెలంగాణల్లోభారీగా విక్రయాలు, నిందితుల అరెస్ట్

child selling racket: బాలల విక్రయ ముఠా గుట్టు రట్టు.. ఏపీ, తెలంగాణల్లోభారీగా విక్రయాలు, నిందితుల అరెస్ట్

Sarath chandra.B HT Telugu
Published May 29, 2024 07:33 AM IST

child selling racket: తెలుగు రాష్ట్రాల్లో పసిపిల్లల్ని అక్రమంగా విక్రయిస్తోన్న ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సంతానలేమితో బాధపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా చిన్నారుల్ని విక్రయిస్తోంది.

బాలల విక్రయ ముఠా వివరాలు వెల్లడిస్తున్న సీపీ తరుణ్ జోషి
బాలల విక్రయ ముఠా వివరాలు వెల్లడిస్తున్న సీపీ తరుణ్ జోషి

child selling racket: ఇతర రాష్ట్రాల్లో చిన్నారుల్ని కిడ్నాప్ చేసి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. ఓ స్వచ్ఛంధ సంస్థ ఇచ్చిన సమాచారంతో ట్రాప్ చేసి నిందితుల్ని వలపన్ని పట్టుకున్నారు.

ఇతర రాష్ట్రాల్లో కిడ్నాప్‌ చేయడమో, అక్రమంగా తరలించడమో చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలా అక్రమ పద్ధతుల్లో పసిపిల్లలను రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షలకు విక్రయిస్తున్నారు. చిన్నారుల్ని విక్రయించిన ఘటనలో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న 13 మంది చిన్నారులను రక్షించారు.

అంతర్రాష్ట్ర బాలల అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు 13 మంది చిన్నారులను రక్షించి 11 మందిని అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం ఆధారంగా పక్కా ప్రణాళికతో వలపన్ని మే 22న ముగ్గురిని అరెస్టు చేశామని, వారి వాంగ్మూలం ఆధారంగా మే 27న మరో ఎనిమిది మందిని అరెస్టు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.

ఢిల్లీ, పుణెల్లోని ముగ్గురు నుంచి శిశువులను పొందినట్లు విచారణలో గుర్తించారు. ఇప్పటి వరకు వీరికి సుమారు 50 మంది శిశువులను సరఫరా చేశారని, ఏజెంట్ల ద్వారా సంతానం లేని దంపతులకు ఒక్కో శిశువుకు రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో నిందితుల నుంచి నెల నుంచి రెండేళ్ల వయసున్న 13 మంది చిన్నారులను స్వాధీనం చేసుకున్నారు. వారిని సంరక్షణ గృహాలకు తరలించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వారిలో తొమ్మిది మంది బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. వీరిని అక్రమంగా కొనుగోలు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేశారు.

ఢిల్లీ, పుణె సహా వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన తెలంగాణతో పాటు ఏపీలో సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో వారిని ట్రాప్‌ చేసి గుర్తించారు. ఈ ముఠా పేద కుటుంబాలను ప్రలోభాలకు గురిచేసి వారి పిల్లలను తరలిస్తోంది. ఢిల్లీ, పుణెలో ముగ్గురు వ్యక్తుల నుంచి నిందితులు శిశువులను పొందారని, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు.

ప్రధాన నిందితులకు ఏజెంట్లు, సబ్ ఏజెంట్లుగా వ్యవహరించిన నిందితులు తమకు దాదాపు 50 మంది శిశువులను సరఫరా చేశారని పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు అంగీకరించారు. పిల్లల్ని కొనుగోలు చేసిన ఆ తర్వాత ఇతర ఏజెంట్ల ద్వారా సంతానం లేని దంపతులకు ఒక్కో శిశువుకు రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.

పరారీలో ఉన్న నిందితులు పిల్లల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేసి వారి పిల్లలను కొనుగోలు చేసేవారని, ఏజెంట్ల మధ్య రెండు, మూడు లేయర్లు దాటిన తర్వాత ఈ పిల్లలను పిల్లలు లేని జంటలకు, చట్టబద్ధమైన దత్తత ప్రక్రియను అనుసరించడానికి ఇష్టపడని దంపతులకు విక్రయించారని పోలీసులు తెలిపారు.

నిందితులు పిల్లల కోసం వెతుకుతున్న వారి నుంచి ఇక్కడ సమాచారం సేకరించారని, ఢిల్లీ, పుణెలోని తమ సహచరులతో మాట్లాడి పిల్లలను పొందేవారని అధికారులు తెలిపారు. నిందితుల్లో కొందరు గతంలో కూడా ఇలాంటి నేరానికి పాల్పడ్డారని, రెండు మూడేళ్లుగా వారు ఈ దందాలో భాగస్వాములయ్యారని పోలీసులు తెలిపారు.

సెక్షన్ 370 (హ్యూమన్ ట్రాఫికింగ్), ఇతర సంబంధిత సెక్షన్ల కింద, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం పీర్జాదిగూడలో రూ.4.50లక్షలకు ఆర్‌ఎంపీ డాక్టర్‌ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడంతో ముఠాగుట్టు రట్టయింది. మొత్తం 16 మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్టు నిర్ధారించారు.

ఎలా దొరికారంటే…

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి జిల్లా ఫిర్జాదిగూడలోని రామకృష్ణానగర్‌లో ఆర్ఎంపి డాక్టర్‌గా పనిచేస్తున్న శోభారాణి ఇటీవల పోలీసులకు చిక్కారు. బోడుప్పల్‌కు చెందిన హేమలత, షేక్‌సలీమ్‌, ఘట్‌కేసర్‌ అన్నోజిగూడకు చెందిన బండారి పద్మ, హరిహరచేతన్‌లు ముఠాగా ఏర్పడి పిల్లల్ని విక్రయిస్తున్నట్టు గుర్తించారు.అధిక సంతానం, పేదరికం కారణంగా విక్రయిస్తున్నట్టు చెప్పేవారు. ఇలా ఒక్కో చిన్నారికి రూ.2లక్షల నుంచి రూ.6లక్షల వరకు వసూలు చేసేవారు.

ఎవరైనా కొనడానికి సిద్ధమైతే పిల్లల్ని సేకరించే ముఠాలకు సమాచారం ఇస్తారు. ఈ ముఠాలో విజయవాడకు చెందిన బలగం సరోజ, ముదావత్ శారద అలియాస్ షకీల పఠాన్, పఠాన్ ముంతాజ్, జగన్నాథం అనురాధ, మహబూబ్‌నగర్‌కు చెందిన ముదావత్‌ రాజు, చర్లపల్లికి చెందిన మమత ఉన్నారు. వీరు ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణెకు చెందిన కన్నయ్యల ద్వారా పిల్లల్ని సేకరించి హైదరాబాద్‌ తరలించేవారు. పిల్లల్ని తరలించే వారు కమిషన్‌గా రూ.50వేల నుంచి రూ.లక్ష కమిషన్ తీసుకునే వారు. ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు.

ఫిర్జాదీగూడలో ఉన్న అక్షరజ్యోతి ఫౌండేషన్‌లో పనిచేసే సాయికుమార్‌‌కు సమాచారం తెలియడంతో మేడిపల్లి పోలీసులకు సమచారం ఇచ్చారు. పిల్లలు కావాలని ఆర్‌ఎంపి డాక్టర్‌ను సంప్రదించారు. బాబుకు రూ.6లక్షలు, పాపకు రూ.4.5లక్షలు ఖర్చవుతాయని శోభారాణి చెప్పారు.రూ.10వేలు అడ్వాన్స్ తీసుకుని 21వ తేదీన ఫోన్ చేసి పాప రెడీగా ఉందని సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లిన వారికి ఓ పాపను చూపించారు. దీంతో పోలీసులు దాడి చేసి నిందితుల్ని పట్టుకున్నారు. అక్రమంగా చిన్నారుల్ని కొనుగోలు చేసిన 16మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 11మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో తెలంగాణకు చెందిన వారు 9మంది ఏపీకి చెందిన వారు ఏడుగురు ఉన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం