TG Education : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.. రెండేళ్లలో పూర్తవ్వాలి.. రేవంత్ కీలక ఆదేశాలు-chief minister revanth reddy holds review meeting with top officials of the education department ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Education : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.. రెండేళ్లలో పూర్తవ్వాలి.. రేవంత్ కీలక ఆదేశాలు

TG Education : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.. రెండేళ్లలో పూర్తవ్వాలి.. రేవంత్ కీలక ఆదేశాలు

Basani Shiva Kumar HT Telugu
Published Feb 14, 2025 02:46 PM IST

TG Education : అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటికి సంబంధించి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

విద్యాశాఖ ఉన్నతాధికారులతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు సంబంధించి.. అవసరమైన స్థలాల సేకరణ, ఇతర పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

పనులు వేగంగా చేయాలి..

నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన చోట.. అనుమతులు, ఇతర పనులను వేగంగా చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో ముందుగా పరిశీలించాలని సూచించారు. అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

వారంలో నివేదిక ఇవ్వాలి..

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని.. త్వరగా స్థలాలను గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనిపై వారం రోజుల్లో నివేదిక అందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలన్నారు. రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో వంద శాతం పనులు పూర్తికావాలని స్పష్టం చేశారు.

ఇవీ స్కూల్స్ లక్ష్యాలు..

విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లక్ష్యం. పోటీ ప్రపంచంలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దనున్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించనున్నారు. అత్యాధునిక వసతులు కలిగిన విశాలమైన క్యాంపస్‌లు నిర్మించనున్నారు. ఈ స్కూల్స్‌లో 4వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బోధన ఉండనుంది.

26 నియోజకవర్గాల్లో..

మొదటి దశలో 26 నియోజకవర్గాల్లో పాఠశాలల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వీటిల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

నిధులు ఇచ్చేందుకు సిద్ధం..

వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా.. పూర్తి స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

Basani Shiva Kumar

eMail
Whats_app_banner