Maoist Damodar : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్, తెలంగాణ మావోయిస్టు పార్టీ కీలక నేత దామోదర్ మృతి
Maoist Damodar : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ నేత చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. దామోదర్ స్వగ్రామం ములుగు జిల్లా కాల్వపల్లి.
Maoist Damodar : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ లో 17 మంది మవోలు మృతి చెందారని భద్రతా బలగాలు ప్రకటించాయి. ఈ ఎన్ కౌంటర్ లో తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ దామోదర్ మృతి చెందారు. దామోదర్ ఎన్నో ఏళ్ల నుంచి మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేశారు. దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. దామోదర్ అలియాస్ చొక్కారావుపై రూ.50 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో దామోదర్‌పై రూ.25 లక్షల రివార్డ్ ఉంది. దామోదర్ 6 నెలల క్రితం మావోయిస్టు పార్టీ సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టు యాక్షన్ టీమ్‌లకు ఇన్‌ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు.
స్వగ్రామంలో విషాదఛాయలు
మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సొంతూరు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో విషాదం అలముకుంది. చొక్కారావు మృతివార్త విని గ్రామస్తులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మావోయిస్టు ఉద్యమంలో దామోదర్ చెరగని ముద్రవేశారు.
మావోయిస్టు పార్టీ ప్రకటన
ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఉసుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కంకేర్ గ్రామంలో జనవరి 16న మావోయిస్టులపై భద్రతా దళాలు దాడి చేశారు. ఈ దాడిలో దామోదర్, హంగీ, దేవే , జోగా, నరసింహారావు వంటి కీలక నేతలు మృతి చెందారని సీపీఐ(మావోయిస్టు) సౌత్ బస్తర్ డివిజన్ ఓ ప్రకటనలో తెలిపింది. భద్రతా దళాలు బీజాపూర్ జిల్లాలోని పూజారి కంకేర్ ప్రాంతంలో "ఆపరేషన్" పేరుతో అమానవీయ అణచివేతకు పాల్పడ్డారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. బస్తర్ సహజ వనరులను దోచుకోవడానికి, గిరిజనుల భూములు దోచుకోవడానికి, అడవుల నుంచి గిరిజనులను నిర్మూలించడం ఈ దాడులని విమర్శించింది. అయితే ఈ ఆపరేషన్ లో 18 మంది మావోయిస్టులు మరణించారని సీపీఐ(మావోయిస్టు) స్పష్టం చేసింది. కామ్రేడ్ బడే చొక్కారావు (దామోదర్ దాదా) ధైర్యసాహసాలను ప్రదర్శించి, పోరాడుతూ అమరుడయ్యాడని సీపీఐ(మావోయిస్టు) పార్టీ తెలిపింది. అతని మరణం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని పేర్కొంది.
బీజాపూర్ ఎన్ కౌంటర్
ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో 17 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దక్షిణ బీజాపూర్ లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం వరకు ఈ కాల్పులు కొనసాగాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మూడు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్) ఐదు బెటాలియన్లు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 229వ బెటాలియన్ సిబ్బందితో కూడిన సంయుక్త బృందం ఈ ఆపరేషన్లో పాల్గొంది.
భద్రతాదళాలు, నక్సలైట్ల మధ్య జరిగిన బీకర ఎదురుకాల్పుల్లో 17 మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. గురువారం ఉదయం బీజాపూర్ లోని బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్కెల్ గ్రామ సమీపంలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్ ఐఈడీ పేలడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.