CM Revanth Reddy : మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలు ప్రకటించారని, ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు.
CM Revanth Reddy : కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మంగళవారం చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జన జాతర బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలవాలన్నారు. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ(Sonia Gandhi) ఆరు గ్యారంటీలను(Six Gaurantees) ప్రకటించారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామన్నారు. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25 వేల ఉద్యోగాల భర్తీ(TS Jobs) చేపట్టామన్నారు.
మార్చి 2న 6 వేల ఉద్యోగాల భర్తీ
మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఓర్వలేని బీఆరెస్(BRS) నేతలు కాంగ్రెస్ పార్టీపై శాపనార్ధాలు పెడుతున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో దర్శనమిచ్చేవని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క చిక్కుముడిని విప్పి ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
కేటీఆర్ కు సవాల్
"మగాడివైతే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించాలి. నువ్వు వస్తావో.. నీ అయ్య వస్తాడో రండి. మేం అల్లాటప్పగాళ్లం కాదు.. నేనేమీ అయ్యపేరు చెప్పి కుర్చీలో కూర్చోలేదు. ప్రజల కోసం అక్రమ కేసులు ఎదుర్కొని, లాఠీ దెబ్బలు తిని, చర్లపల్లి జైలుకు వెళ్లా. నిన్ను, మీ అయ్యను, నీ బావను బొందపెట్టి ప్రజలు మమ్మల్ని కుర్చీలో కూర్చొబెట్టారు. ఈ కుర్చీ మా కార్యకర్తల పోరాటంతో వచ్చింది" -సీఎం రేవంత్ రెడ్డి
హామీలిచ్చి మోసం చేయడమే గుజరాత్ మోడల్
ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ మోడల్ (Gujarat Model)అంటే హామీలు ఇచ్చి మోసం చేయడమా? ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపడమా? అని ప్రశ్నించారు. మళ్లీ మోదీని ప్రధానిని చేయాలని బీజేపీ నేతలు అంటున్నారని, ఇప్పటి వరకు ప్రధాని పదవిలో ఉన్న మోదీ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇన్నాళ్లు కలిసి పనిచేసిన కేడీ-మోడీ.. ఇప్పుడు ఇద్దరూ తాము వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు. పేదలకు ఇండ్లు కట్టివ్వలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు...ఇదేనా గుజరాత్ మోడల్? ప్రశ్నించారు. చేవెళ్ల ప్రాజెక్టును(Chevella Project) పూర్తి చేసి ప్రతీ ఎకరానికి నీళ్లు ఇచ్చే బాధ్యత తనదన్నారు.
సంబంధిత కథనం