Chevella Mla Gunman : బైక్ ను తాకిన అడవి పంది, రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే గన్ మెన్ మృతి
Chevella Mla Gunman : చేవెళ్ల ఎమ్మెల్యే గన్ మెన్ శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి బంధువు ఇంటి నుంచి వస్తున్న క్రమంలో అడవి పందిని ఢీకొని బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Chevella Mla Gunman : చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య దగ్గర గన్ మెన్ గా పనిచేస్తున్న ముత్తంగి శ్రీనివాస్ (31) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్, పక్కనే ఉన్న సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం మండలంలోని వెలిమెల గ్రామంలో బంధువుల ఇంట్లో ఫంక్షన్ అటెండ్ కావడానికి ఆదివారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అయితే, దారి మధ్యలో తన వాహనానికి అడవి పంది తగలటంతో, బండి అదుపు తప్పి పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు.

పొద్దునే గుర్తించిన బాటసారులు
రోడ్డు పక్కనే పడిన శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందాడు. చీకట్లో అతడిని ఎవరు గమనించలేదు. సోమవారం ఉదయం బాటసారులు గుర్తించి, అతడి ఐడెంటిటీ కార్డు ఆధారంగా పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే, సంఘటనా స్థలానికి చేరుకున్న బీడీఎల్ భానూర్ పోలీసులు, మృతదేహాన్ని పఠాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విధి నిర్వహణలో నిబద్దత కలిగినవాడు
పోస్టుమార్టం అనంతరం శ్రీనివాస్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం బుల్కాపూర్ గ్రామానికి తరలించారు. సుమారుగా పది సంవత్సరాల క్రితం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధుల్లో చేరిన శ్రీనివాస్ పలువురు కీలకమైన నాయకుల దగ్గరగా గన్ మెన్ గా పనిచేసినట్టు సహచరులు తెలిపారు. ప్రస్తుతం చేవెళ్ల ఎమ్మెల్యే దగ్గర 2023 నుంచి గన్ మెన్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. విధి నిర్వహణలో శ్రీనివాస్ ఎంతో నిబద్ధతతో ఉండేవాడని సహచరులు గుర్తుచేసుకున్నారు. అతడి అకాల మరణంతో, భార్య ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారని విచారం వ్యక్తం చేశారు.