Actress Kasturi Arrest : తెలుగు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసు, హైదరాబాద్ లో నటి కస్తూరి అరెస్ట్
Actress Kasturi Arrest : హైదరాబాద్‌లో నటి కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కస్తూరిపై చెన్నైలో కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలిస్తున్నారు.
తెలుగు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నార్సింగి పరిధిలో పోలీసులు ఆమెను శనివారం రాత్రి అరెస్టు చేశారు. నటి కస్తూరిని చెన్నైకి తరలిస్తున్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కస్తూరి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. దీంతో చెన్నై పోలీసులు ఆమె కోసం గాలించగా...హైదరాబాద్ లో ఆచూకీ లభ్యమైంది.
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో చెన్నై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. చెన్నైలో నిర్వహించిన ఓ ఆందోళనలో పాల్గొన్న కస్తూరి తెలుగువారిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నటి వ్యాఖ్యలపై పలు తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని పలు పోలీసుస్టేషన్లలో కస్తూరిపై ఫిర్యాదులు చేశారు. చెన్నైలో ఓ తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో సమన్లు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించగా... ఆమె పరారయ్యారు. ఆమె ఇల్లు తాళం వేసి ఉండడం, సెల్ ఫోన్ స్విచ్ఛాప్ చేయడంతో... ఆమె కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడికే చేరుకుని ఆమెను అరెస్టు చేశారు.
సంబంధిత కథనం