Warangal Crime: వరంగల్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, అర్ధరాత్రి ఆయుధాలతో సంచారం, సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు-cheddi gang active in warangal roaming with weapons at midnight recorded on cctv cameras ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Crime: వరంగల్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, అర్ధరాత్రి ఆయుధాలతో సంచారం, సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

Warangal Crime: వరంగల్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, అర్ధరాత్రి ఆయుధాలతో సంచారం, సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

HT Telugu Desk HT Telugu

Warangal Crime: వరంగల్ నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ ఎంటర్ అయ్యింది. ఇదివరకు హైదరాబాద్ లో దారుణాలు, చోరీలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్ .. ఇప్పుడు వరంగల్ నగరంలోకి ప్రవేశించడంతో జనాల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది.

చెడ్డీ గ్యాంగ్ హల్చల్ (ఫైల్ ఫోటో)

Warangal Crime: ఇప్పటికే వరుస చోరీలతో గ్రేటర్ వరంగల్ సిటీలో జనాలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతుండగా, ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ అర్ధరాత్రి తలుపులు తడుతుండటం కలవరానికి గురి చేస్తోంది. వరంగల్ ట్రై సిటీ పరిధిలో మూడు వేర్వేరు చోట్లా చెడ్డీ గ్యాంగ్ సంచరించడం కలకలం రేపింది.

ముఖానికి ముసుగు.. చేతిలో ఆయుధం

చెడ్డీ గ్యాంగ్ లోని దుండగులంతా ముఖానికి ముసుగు పెట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. ముఖ్యంగా నిఘా తక్కువగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసుకుని అర్ధరాత్రి తలుపులు బాదుతున్నారు. గతంలో హైదరాబాద్ లో మారణాయుధాలతో దాడులకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్ కు సంబంధించిన వ్యక్తులు, ఇప్పుడు వరంగల్ వీధుల్లో అర్ధరాత్రి చేతుల్లో రాడ్లు, కత్తులతో తిరుగుతున్నారు.

ఈ పరిణామాలపై జనాల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఓ ఇంటికి వచ్చిన చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ఐదారుగురు చెడ్డీ గ్యాంగ్ మెంబర్స్ టార్చ్ లైట్లతో వచ్చి ఇంటిని కొల్లగొట్టగా.. ఆ దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.

హనుమకొండ విద్యారణ్యపురి ఏరియాలో కూడా చెడ్డీ గ్యాంగ్ సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. వరంగల్ శివారులో ఉన్న మడికొండ పీఎస్ పరిధిలో కూడా చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు స్థానికులు కొంతమంది పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు దానికి సంబంధించిన సీసీ ఫుటేజీ సేకరించి, దాని ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.

చెడ్డీ గ్యాంగ్ కు సంబంధించిన వ్యక్తులు చేతిలో కత్తులు పట్టుకుని తిరుగుతున్నారని, ఎవరికైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అక్కడి సీఐ కిషన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆరా తీస్తున్న పోలీసులు

వరంగల్ ట్రై సిటీలోని హనుమకొండ ప్రాంతంలో ఒకే రోజు మూడు చోట్లా చెడ్డీ గ్యాంగ్ సంచారం సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా కేయూ, మడికొండ స్టేషన్ల పరిధిలో ఇటీవల చోరీలు ఎక్కువగా జరుగుతుండటంతో ఆయా పీఎస్ ల ఆఫీసర్లు తనిఖీలు చేపడుతున్నారు. ఈ మేరకు వరంగల్ నగరంలోని లాడ్జిలు, హోటళ్లలో విస్తృతంగా గాలిస్తున్నారు.

ఎక్కడికక్కడ నగరంలో అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు. ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు చెడ్డీ గ్యాంగ్ సంచరించిన ప్రాంతాల్లో స్థానికుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపు వెళ్లారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటారా అనే అనుమానంతో పెట్రోలింగ్ ముమ్మరం చేయాల్సిందిగా కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు కూడా ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే వరుస దొంగతనాలతో జనాలు హడలెత్తిపోతుండగా, ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీ మరో భయం మొదలైంది. దీంతో చెడ్డీ గ్యాంగ్ ఎలాంటి దారుణాలకు పాల్పడకముందే వారిని పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

HT Telugu Desk

సంబంధిత కథనం