TS bPass : భూమి కొంటున్నారా ? టీఎస్ - బిపాస్ ద్వారా సర్వే నంబర్లు చెక్ చేసుకోండి-check land use information and survey number details on ts bpass ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Check Land Use Information And Survey Number Details On Ts Bpass

TS bPass : భూమి కొంటున్నారా ? టీఎస్ - బిపాస్ ద్వారా సర్వే నంబర్లు చెక్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Mar 04, 2023 04:24 PM IST

TS bPass : టీఎస్ - బిపాస్ లో మరిన్ని సేవలను పొందుపరిచింది.. తెలంగాణ ప్రభుత్వం. ఈ విధానం ద్వారా భూ వినియోగ.. సర్వే నంబర్ల వివరాలూ అందించనుంది. సిటిజన్లు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపు సమగ్ర వివరాలు తెలియజేయనుంది.

టీఎస్ - బిపాస్ ద్వారా మరిన్ని సేవలు
టీఎస్ - బిపాస్ ద్వారా మరిన్ని సేవలు

TS bPass : ఇటీవలికాలంలో అత్యధిక శాతం మంది తమ పెట్టుబడులను... భూములపై పెడుతున్నారు. ముఖ్యంగా నగరాల్లో ప్లాట్స్ లపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. భూములు, ప్లాట్ల రేట్లు వృద్ధి చెందుతున్న నేపథ్యంలో.. ఆదాయానికి ఇదే మంచి మార్గంగా చాలా మంది భావిస్తున్నారు. అయితే.. కొంత మంది భూముల విషయంలో ప్రజలని తప్పుదోవ పట్టించి నిండా ముంచుతున్నారు. వ్యవసాయ, కన్జర్వేషన్ జోన్ లలో ఉన్న భూములను కూడా ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు ఆ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకొని లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూములకి సంబంధించి పూర్తి సమాచారం తెలుసునేందుకు సరికొత్త వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

భవన నిర్మాణాలకు సత్వర అనుమతుల కోసం తీసుకొచ్చిన టీఎస్ బిపాస్ ద్వారా ఇకపై... భూ వినియోగ వివరాలనూ ప్రజలకు అందించనుంది. తొలుత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని సర్వే నంబర్లలో ఉన్న ల్యాండ్ యూజ్ స్టేటస్ ని వెల్లడించనుంది. దీని ద్వారా సర్వే నంబర్లతో పాటు... ఆయా సర్వే నంబర్లు ఏ జోన్ లో ఉన్నాయో తెలుసుకోవచ్చు. రెసిడెన్షియల్, కమర్షియల్, పారిశ్రామిక, వ్యవసాయం, రీక్రియేషనల్, కన్జర్వేషన్ జోన్ల భూముల వివరాలు రాబట్టవచ్చు. భూములు కొనుగోలు చేయడం.. లేదా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టు ప్రారంభించాలని అనుకున్న వారు... టీఎస్ బిపాస్ ద్వారా ఆయా ల్యాండ్స్ కి సంబంధించిన సమగ్ర సమాచారం కోరవచ్చు. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ముందడుగు వేయడంపై నిర్ణయం తీసుకోవచ్చు.

భూ వినియోగ, సర్వే నంబర్ల వివరాల కావాలని అనుకునే సిటిజన్లు... lui.tsbpass.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమాచారం, సర్వే నంబర్లు, గ్రామం - మున్సిపాలిటీ తదితర వివరాలు నమోదు చేయాలి. పూర్తి వివరాలు ఎంటర్ చేసిన తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క దరఖాస్తు ద్వారా 5 సర్వే నంబర్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఒక్కో సర్వే నంబర్ కోసం రూ.500, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు అందిన తర్వాత... సర్వే అధికారులు సమగ్ర పరిశీలన జరిపి.. 21 రోజుల్లో భూ వినియోగ వివరాలు, అనుమతులకి సంబంధించిన పూర్తి వివరాలను దరఖాస్తుదారుడికి అందజేస్తారు. అన్ని సమగ్రంగా ఉన్నాయనుకుంటే ... వినియోగదారులు కొనుగోలు లేదా ప్రాజెక్టు ప్రారంభించేందుకు ప్రొసీడ్ అవ్వొచ్చు. భవన నిర్మాణాల అనుమతుల కోసం.. టీఎస్ బిపాస్ ద్వారానే దరఖాస్తు చేసుకొని పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అమలు చేస్తున్న ఈ విధానం ద్వారా వచ్చే ఫలితాలను విశ్లేషించి.. రానున్న రోజుల్లో ఫేజ్ 2 లో డీటీసీపీ పరిధిలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. భూ వినియోగ వివరాలను ఇప్పటి వరకు డీపీఎంఎస్ వ్యవస్థ ద్వారా సిటిజన్లు పొందే వారు. అయితే... భవన నిర్మాణాల అనుమతులు, లే అవుట్ పర్మిషన్స్, ల్యాండ్ యూజ్ డీటెయిల్స్ వంటి సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చేందుకే... టీఎస్ - బీపాస్ లో నూతన సర్వీసెస్ చేర్చామని అధికారులు చెబుతున్నారు.

IPL_Entry_Point