Vande Bharat Timings: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ప్రయాణ సమయాల్లో మార్పు-change in secunderabad tirupati vandebharat travel timings ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Change In Secunderabad-tirupati Vandebharat Travel Timings

Vande Bharat Timings: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ప్రయాణ సమయాల్లో మార్పు

HT Telugu Desk HT Telugu
May 15, 2023 08:03 AM IST

Vande Bharat Timings: సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలు ప్రయాణ వేళల్లో మార్పులు ఈ నెల 17నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పాటు వందే భారత్ రైలు కోచ్‌ల సంఖ్యను 8 నుంచి 16కు పెంచుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

వందే భారత్ రైలు
వందే భారత్ రైలు (Kishan Reddy Twitter )

Vande Bharat Timings: తిరుపతి వందేభారత్‌ రైలు ప్రయాణ సమయంలో మార్పులు 17వ తేదీ నుంచి అమలు కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు అందించేలా అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వందే భారత్ రైలుకు డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రయాణికులు బుకింగ్ కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సి వస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

వందే భారత్‌లో కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించడంతో ఈ రైలులో ప్రయాణాల కోసం ఎదురు చూసే వారి కష్టాలు తగ్గనున్నాయి. దీంతో పాటు రైలు వేగం కూడా పెరగనుంది. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే వందేే భారత్‌ రైల్లో ప్రస్తుతం 8 కోచ్‌లుండగా, వాటి సంఖ్య 16కి పెరగనుంది. ఈ సౌకర్యం మే 17 నుంచి అమల్లోకి వస్తుంది.

దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్‌ నిలయంలోని ట్రాన్స్‌పోర్టేషన్‌ బ్రాంచి నుంచి సికింద్రాబాద్‌, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజినల్‌ రైల్వే మేనేజర్లకు ఆదివారం ఉత్తర్వులు అందాయి. రైలు ప్రయాణ సమయాన్ని కూడా 15 నిమిషాలు తగ్గించారు. ఇతర వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలో 16 కోచ్‌లు ఉండగా తిరుపతి వందేభారత్‌లో 8 కోచ్‌లే ఉండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ను కోచ్‌ల సంఖ్య పెంచాలని కోరడంతో వెంటనేే సానుకూల నిర్ణయం వచ్చింది.

వందేభారత్‌లో ప్రస్తుతం 530 సీట్లు ఉన్నాయి . వీటిలో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌- 52 సీట్లు, ఛైర్‌కార్‌‌లో సీట్లు - 478 ఉన్నాయి. కోచ్‌ల సంఖ్య పెరగడంతో సీట్ల సంఖ్య 1,060కి పెరగనుంది. సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నెం.20701/20702 ప్రస్తుత ప్రయాణ సమయం 8.30 గంటలుగా ఉంది. ఈ రైలు వేగాన్ని కూడా పెంచారు. ప్రయాణికులు ఇకనై 8.15 గంటల్లోనే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణింవచ్చు. ఈ మేరకు రైలు ప్రయాణ వేళలను సవరించారు.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరుతున్న ఈ రైలు 17వ తేదీ నుంచి 6.15కి బయల్దేరుతుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే రైలు ప్రస్తుతం రాత్రి 11.45కి చేరుతోంది. ఇకపై రాత్రి 11.30 గంటలకే చేరుతుంది.

మే17 నుంచి వందే భారత్ రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణ సమయాన్ని మార్పు చేశారు. సికింద్రాబాద్‌లో ఉదయం 6.15కు బయలుదేరు రైలు నల్గొండకు ఉదయం 7.29కు చేరుతుంది. గుంటూరుకు 9.35, ఒంగోలుకు 11.12కు, నెల్లూరుకు 12.29కు, తిరుపతికి 2.30కు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో తిరుపతిలో మధ్యాహ్నం 3.15కు బయలుదేరుతుంది. నెల్లూరుకు 4.49కు, ఒంగోలుకు సాయంత్రం 6గంటలకు, గుంటూరుకు 7.45కు, నల్గొండకు రాత్రి 9.49కు సికింద్రాబాద్‌కు రాత్రి 11.30కు చేరుతుంది.

IPL_Entry_Point