Revanth And CBN: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నివాళులు
Revanth And CBN: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మన్మోహన్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. దేశం గొప్ప రాజకీయ నాయకుడిని కోల్పోయిందని రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
Revanth And CBN: ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ఒక సందేశంలో పేర్కొన్నారు.
ఒక ఆర్థిక వేత్తగా, ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా వారు దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పూడ్చలేనిదని అన్నారు. మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. 'భారత మాజీ ప్రధాని, పేరెన్నికగన్న ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యాను. మేధావి, రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతి రూపం. కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్య్రం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు' అని ట్వీట్ చేశారు.
దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత...
భారత దేశ మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాయనని జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మన్మోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఒకరు శ్రీ మన్మోహన్ సింగ్ గారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ ఛైర్మన్ గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గారు హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కిందని, ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవన్నారు. మన్మోహన్ సింగ్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్టు పవన్ ప్రకటించారు.
మంత్రులు సంతాపం..
దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్లరాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేశారు. పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచే సిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో, జిడిపి వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించారని, సత్పురుషుడు, నిజాయితీపరుడైన మన్మోహన్ సింగ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని ప్రకటించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. . దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గారు చరిత్రలో నిలిచిపోతారు. పదేళ్ల పాటు భారతప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ గారి మృతి తీరని లోటన్నారు.
మన్మోహన్ సింగ్ సేవలను దేశం ఎప్పుడు గుర్తుంచుకుంటుందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. దేశాన్ని అగ్రస్థాయి ఆర్థిక శక్తిగా మార్చే దిశగా మన్మోహన్ సింగ్ నిత్యం అడుగులు వేశారని గుర్తు చేసుకున్నారు.