Telangana Teachers : ఇతర దేశాలకు తెలంగాణ ఉపాధ్యాయులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!-chance to send telangana teachers to other countries for improvement of education system ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Teachers : ఇతర దేశాలకు తెలంగాణ ఉపాధ్యాయులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

Telangana Teachers : ఇతర దేశాలకు తెలంగాణ ఉపాధ్యాయులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

Telangana Teachers : రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యా వ్యవస్థ ముఖచిత్రం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మంత్రి శ్రీధర్ బాబు విద్యా సంస్కరణలపై సమీక్ష నిర్వహించి.. కీలక వ్యాఖ్యలు చేశారు.

బాలబాలికలతో ఉపాధ్యాయురాలు (istockphoto)

తెలంగాణ ఉపాధ్యాయులను ఇతర దేశాలకు పంపించి నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థ ముఖచిత్రం మారేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా.. పాఠశాల విద్య ముఖచిత్రాన్ని సమూలంగా మార్చాలని శ్రీధర్ బాబు ఆదేశించారు.

శ్రీధర్ బాబు సమీక్ష..

తెలంగాణ సచివాలయంలో సోమవారం నాడు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.యోగితా రాణా ఇతర ఉన్నతాధికారులతో విద్యా సంస్కరణలపై శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ స్కూళ్లు.. ఎందువల్లనో ఇప్పుడా పరిస్థితిలో లేవని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడలేక పోతున్నామని.. దీనికి కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని సూచించారు.

ప్రభుత్వం సిద్ధంగా ఉంది..

'స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగు పర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ చదువులను అందించాలని రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఇందుకు అనువైన పరిస్థితులను విద్యాశాఖ కల్పించాలి. గుజరాత్ నుంచి ఏటా 30- 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయాలు సింగపూర్‌కు వెళ్లి ఉన్నత శిక్షణ పొంది వస్తున్నారు. ఆ తరహా ప్రయత్నం మనవద్ద కూడా జరగాలి' అని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.

తెలంగాణకు సింగపూర్ బృందం..

'ఫిన్లాండ్, ఫ్రాన్స్, యూకేలో విద్యా ప్రమాణాలపై అధ్యయనం చేసి.. మన వద్ద కూడా ఆ స్థాయి విద్యను ప్రవేశపెట్టాలి. పాఠ్యాంశాలను మార్చాలి. సింగపూర్ ప్రభుత్వం మన దగ్గర ప్రపంచస్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. త్వరలోనే సింగపూర్ బృందం పర్యటిస్తుంది. దానికి సంబంధించిన విధివిధానానలు సిద్ధం చేయాలి' శ్రీధర్ బాబు ఉన్నతాధికారులను ఆదేశించారు.

మార్పులు రావాలి..

'వచ్చే 2-3 ఏళ్లలో మన విద్యావిధానంలో సమూల మార్పులు రావాలి. విద్యపై ఎంతో ఖర్చు పెడుతున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించి.. అందులో మెరుగైన విధానాలను అమలు చేసే విషయం పరిశీలించాలి. కింది తరగతుల నుంచే విద్యార్థులకు కృత్రిమ మేథపై అవగాహన కల్పించాలి. హైస్కూలు స్థాయిలో దానిని వినియోగించి తెలివితేటలను పెంచుకునేలా చూడాలి. భేషజాలకు పోకుండా కన్సల్టెంట్ల సేవలను తీసుకోవాలి. మన ఆలోచనల కంటే వారి సూచనలు వాస్తవికంగా ఉంటాయి' అని శ్రీధర్ బాబు వివరించారు.

దారులు వేయాలి..

'ఒకప్పుడు డీఈవోలు తరచూ స్కూళ్లను తనిఖీ చేసేవారు. ఎంఈవోలు కూడా ఇతర పనులు చేస్తున్నారు తప్ప విద్యాప్రమాణాలు పెంచే ప్రయత్నం జరగటం లేదు. స్కూళ్లలో వకృత్వ పోటీలు జరిగేవి. విద్యార్థులను పిక్నిక్‌లకు తీసుకెళ్లేవారు. ఎక్సకర్షన్లు ఉండేవి. ప్రైవేటు స్కూళ్లలో ఇవన్నీ జరగుతున్నాయి. వచ్చే తరం పిల్లలకు మనం ప్రపంచస్థాయి విద్యను అందించగలిగితేనే వాళ్లు పోటీ ప్రపంచంలో మనగలగుతారు. ఈ విషయాన్ని గుర్తెరిగి సమూల మార్పులకు దారి వేయాలి' అని శ్రీధర్ బాబు సూచించారు.