TG Paddy Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు సవాలక్ష అడ్డంకులు.. ముందుకు సాగని కొనుగోళ్లు-challenging obstacles to paddy procurement in telangana procurement not moving forward ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Paddy Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు సవాలక్ష అడ్డంకులు.. ముందుకు సాగని కొనుగోళ్లు

TG Paddy Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు సవాలక్ష అడ్డంకులు.. ముందుకు సాగని కొనుగోళ్లు

HT Telugu Desk HT Telugu
Nov 20, 2024 11:36 AM IST

TG Paddy Procurement: రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ముక్తకంఠంతో ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అనుకూలంగా లేదు.

తెలంగాణలో ముందుకు సాగని ధాన్యం కొనుగోళ్లు
తెలంగాణలో ముందుకు సాగని ధాన్యం కొనుగోళ్లు

TG Paddy Procurement: తెలంగాణలో అత్యధిక వరి ధాన్యం దిగుబడి వచ్చే నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సమస్యాత్మకంగా మారింది.అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు ఎన్ని భరోసా మాటలు చెప్పినా ప్రయోజనం కనిపించడం లేదు.

ఆది నుంచీ కొనుగోళ్లకు అడ్డంకులు

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12.79 లక్షల ఎకరాల్లో సన్న, దొడ్డు రకం వరి ధాన్యం పండించారు. దీనిద్వారా 29.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి మార్కెటింగ్, ఐకేపీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ల ఆధ్వర్యంలో 870 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇవే కాకుండా మిల్లర్లు కూడా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేశారు. అయితే, పంటల దిగుబడులు రావడం మొదలైన రోజు నుంచీ ప్రభుత్వానికి, రైస్ మిల్లర్ల మధ్య పేచీ నడిచింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని బియ్యం పట్టి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలి. ఈ బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రేషన్ దుకాణాల ద్వారా అర్హులకు విక్రయిస్తారు.

కస్టమ్ మిల్లింగ్ కోసం ప్రభుత్వం ధాన్యం ఇవ్వాలంటే మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాలని ప్రభుత్వం నిబంధనలు విధించడంతో మిల్లర్లు ససేమిరా అన్నారు. ఫలితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయాయి. అక్టోబరు 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు జీవో 27 ప్రకారం ధాన్యం కొనుగోళ్ల పాలసీని ప్రకటించింది.

ఈ పాలసీని మిల్లర్లు వ్యతిరేకించడంతో కొనుగోళ్లు పెండింగ్ లో పడ్డాయి. ఈ లోగా రైతుల నుంచి మిల్లర్లు సన్న రకం ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ధాన్యం తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుండడంతో మిల్లర్లు చెప్పిన ధరలకే విక్రయించుకోక రైతులకు తప్పడం లేదు. ఫలితంగా వీరికి గిట్టుబాటు ధర లభించలేదు. చివరకు మిల్లర్లకు, ప్రభుత్వానికి మధ్య బ్యాంకు గ్యారెంటీల విషయంలో రాజీ కుదిరినా ఇంకా ధాన్యం కేంద్రాల్లో రైతులు పడిగాపులు గాస్తూనే ఉన్నారు.

నల్గొండ జిల్లాలో కొనుగోళ్లు స్వల్పమే

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా నల్గొండ జిల్లాలో వరి సాగు చేసే ఆయకట్టు ఎక్కువగా ఉంది. నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతం ఎక్కువగా ఉండడంతో వరి ధాన్యం దిగుబడులు కూడా ఎక్కువే. జిల్లా పరిధిలోని నల్గొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. మరో వైపు సాగర్ ఆయకట్టు ప్రాంతంలోని మిర్యాలగూడ, నాగార్జున సాగర్ నియోజకవర్గాలతో పాటు, దేవరకొండ నియోజకవర్గంలో ఇంకా కోతలు పూర్తి కాలేదు.

అత్యధిక రైస్ మిల్లులు ఉన్నది కూడా ఈ ప్రాంతంలోనే. మిర్యాలగూడ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల పరిధిలోని రైతులు సన్న రకం వరి సాగు చేస్తుండగా, మిగిలిన నియోజకవర్గాల్లో దొడ్డు రకం వరి సాగవుతోంది. కాగా, జిల్లాలో 5.19 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు చేయగా, 12.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. దీనికోసం 340 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

40శాతం కూడా పూర్తి కాని కొనుగోళ్లు…

ఈ సారి జిల్లాలో 7.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఇప్పటి వరకు కేవలం 1.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇంకా 68వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాశులు ఉన్నాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. మిర్యాలగూడ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో కోతలు ఇంకా 40 శాతం పూర్తి కావాల్సి ఉంది.

అంటే, ఇంకా నలభై శాతం వరి ధాన్యం దిగుబడులు రావాల్సి ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యానికి, ఇప్పటి వరకు సాధించిన లక్ష్యానికి పొంతన లేకుండా ఉంది. వివిధ కారణాల వల్ల వరి పండిస్తున్న రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రభుత్వ కొనుగోళ్ల కేంద్రాలపై, లేదంటే మిలర్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

Whats_app_banner