Sangareddy Crime : తులసి చెట్టుకు పూజ చేస్తున్న మహిళ.. మెడలో పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు
Sangareddy Crime : ఓ మహిళ తెల్లవారుజామున ఇంటి ఆవరణలోని తులసి చెట్టుకు పూజ చేస్తుంది. ఆ మహిళ మెడలో నుండి నాలుగు తులాల పుస్తెలతాడును దుండగులు తెంపుకొని పారిపోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం పటాన్‌చెరు పట్టణంలో కలకలం సృష్టించింది. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
పటాన్‌చెరు పట్టణం శాంతినగర్ కాలనీలో శ్రీపాద సోమలక్మి (80) అనే వృద్ధ మహిళ నివాసముంటోంది. కార్తీకమాసం కావడంతో ఆదివారం తెల్లవారుజామున సోమలక్ష్మి ఇంటి ముందు ఉన్న తులసి చెట్టుకు పూజ చేస్తుంది. ఆమె ఒంటరిగా పూజ చేయడం గమనించిన ఇద్దరు దుండగులు.. బైక్‌పై వచ్చి రెక్కీ నిర్వహించారు. ఆ సమయంలో ఒంటరిగా పూజ చేయడం, కాలనీలో ఎవరు కనపడకపోవడాన్ని దుండగులు గ్రహించారు.
ఇదే మంచి సమయం అనుకోని ఒక వ్యక్తి బైక్ పై కూర్చొని ఉండగా.. మరో వ్యక్తి సోమలక్ష్మి వద్దకు వచ్చి ఆమె మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడుని లాక్కొని పారిపోయాడు. వెంటనే ఆ మహిళా తేరుకొని లబోదిబోమని గట్టిగా అరిచింది. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే దుండగులు బంగారంతో అక్కడి నుండి పారిపోయారు. దొంగతనం చేసిన దుండగులు వారి ముఖం గుర్తు పట్టకుండా హెల్మెట్ ధరించారు. మాస్క్ పెట్టుకున్నారు.
ఈ ఘటన దృశ్యాలు కాలనీలో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
విద్యార్థులు అదృశ్యం..
ఆదర్శ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఐ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు పాఠశాల భవనంపై సిగరెట్లు కాల్చారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ విద్యార్థులను మందలించారు. శనివారం విద్యార్థుల ప్రవర్తనపై ప్రిన్సిపాల్ వారి తల్లితండ్రులను పిలిచి పరిస్థితిని వివరించారు. ఆ విషయాన్నీ గమనించిన ముగ్గురు విద్యార్థులు.. అదేరోజు మధ్యాహ్నం పాఠశాల ప్రహరీ దూకి పారిపోయారు. ఆ విద్యార్థులు ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)