Warangal : వరంగల్ నగరంలో చైన్ స్నాచింగ్ - మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ
వరంగల్ నగరంలో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వరంగల్ నగరంలో ఓ వైపు అంతర్రాష్ట్ర దొంగలు హడలెత్తిస్తుంటే.. మరో వైపు చైన్ స్నాచింగ్ కేసులు కలవర పెడుతున్నాయి. మాస్కులు, హెల్మెట్లు, క్యాపులు ధరించి రావడం, రోడ్డు మీద వెళ్లే ఒంటరి మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగులకు పాల్పడటం పరిపాటిగా మారింది. తాజాగా వరంగల్ నగరంలోని సుబేదారి పీఎస్ పరిధిలో కూడా ఇదే జరిగింది. సుబేదారి పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండ నక్కలగుట్టలోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన అనుమాండ్ల సమ్మక్క అనే 60 ఏళ్ల వృద్ధురాలు వ్యక్తిగత పని మీద వారి స్వగ్రామం వరంగల్ జిల్లా సంగెం మండలం రామ చంద్రాపురం వెళ్లింది. తిరిగి బుధవారం సాయంత్రం సమయంలో హౌజింగ్ బోర్డు కాలనీలోకి తన ఇంటికి బయలు దేరింది. సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో అదాలత్ జంక్షన్ వద్ద ఆటో దిగి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే సాయంత్రం 5.30 గంటల సుమారులో ఆ మార్గంలో ఉన్న లక్ష్మీ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ వద్దకు చేరుకుంది.
ఇదిలా ఉంటే ఇద్దరు గుర్తు తెలియని యువకులు నల్లని క్యాపులు, ముఖానికి మాస్కులు ధరించి, బైక్ పై సమ్మక్కకు ఎదురుగా వచ్చారు. బండి రన్నింగ్ లోనే సమ్మక్క మెడలో ఉన్న పుస్తెల తాడును గుంజుకుని పరారయ్యారు. దాదాపు లక్షన్నర విలువైన 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లడంతో సమ్మక్క అక్కడే కేకలు పెట్టింది. స్థానికులు, ఇతర వాహనదారులు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ
చైన్ స్నాచింగ్ జరిగిన అనంతరం సమ్మక్క వెంటనే సమీపంలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐ సత్యనారాయణ రెడ్డి ఆదేశాల మేరక ఆ మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలించే పనిలో పడ్డారు. కాగా లక్ష్మీ రెసిడెన్సీ అపార్ట్మెంట్ సమీపంలోని ఓ సీసీ కెమెరాలో నిందితులు బైక్ పై వెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.
దీంతో హీరోహోండా స్ప్లెండర్ బండి మీద వచ్చిన ఇద్దరు దుండగులు చైనింగ్ స్నాచింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు సీసీ ఫుటేజీ నుంచి ఫొటోలు సేకరించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, తొందర్లోనే వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని సుబేదారి పోలీసులు వివరించారు.
నిందితులను ఎవరైనా గుర్తిస్తే వెంటనే సుబేదారి సీఐ నెంబర్ 87126 85114 లేదా పీఎస్ నెంబర్ 87126 85003 నెంబర్ కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు ఒంటరిగా సంచరిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని , అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని తెలిపారు. అత్యవసర సమయంలో డయల్ 100 సేవలను కూడా వినియోగించుకోవచ్చని పోలీసులు సూచించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
టాపిక్