Kothagudem Airport : కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మరో ముందడుగు.. స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం-central team inspects proposed site for construction of kothagudem airport ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kothagudem Airport : కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మరో ముందడుగు.. స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

Kothagudem Airport : కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మరో ముందడుగు.. స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

Basani Shiva Kumar HT Telugu
Jan 24, 2025 12:06 PM IST

Kothagudem Airport : కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మరో ముందడుగు పడింది. విమానాశ్రయం నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. దక్షిణ అయోధ్యలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని చాలా కాలంగా ఖమ్మం ప్రజలు కోరుతున్నారని.. ప్రజాప్రతినిధులు కేంద్ర బృందానికి వివరించారు.

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మరో ముందడుగు
కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మరో ముందడుగు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కొంత స్థలాన్ని ప్రతిపాదించారు. సుజాతనగర్‌ మండలం గరీబ్‌పేటలో గుర్తించిన స్థలాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా బృందం తాజాగా పరిశీలించింది. ఏరో ప్లానింగ్‌, ఆర్కిటెక్ట్‌, ఆపరేషన్స్‌, ఇంజినీరింగ్ విభాగం ప్రతినిధులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి, కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్, కేంద్ర బృందంతో కలిసి అక్కడి పరిస్థితులను వివరించారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన 5 అంశాలు ఇలా ఉన్నాయి.

1.కేంద్ర బృందం ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు గరీబ్‌పేటకు చేరుకున్నారు. మ్యాప్‌ వివరాలతో పాటు చుట్టుపక్కల సుజాతనగర్, చుంచుపల్లి, కొత్తగూడెం మండలాల పరిధిలోని ప్రదేశాల్ని పరిశీలించారు. సమీపంలో ఉన్న వాగులు, కుంటలు, అడవి, భూ స్వభావం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

2.విమానాశ్రయం ఏర్పాటుకు సుమారు 954 ఎకరాలు గుర్తించామని జిల్లా కలెక్టర్ వివరించారు. దీంట్లో అటవీశాఖకు చెందినది 754 ఎకరాలు కాగా.. పట్టా భూమి 200 ఎకరాలు ఉందని చెప్పారు. పరిసర ప్రాంతాల్లో ఎత్తైన విద్యుత్‌ టవర్లు, కొండలు, నీటికుంటలు లేవని కేంద్ర బృందానికి వివరించారు. నివాస గ్రామాలు ఈ స్థలానికి దూరంగా ఉన్నాయని వారికి వివరించారు.

3.ప్రస్తుతం ప్రతిపాదించిన స్థలం విమానాశ్రయ నిర్మాణానికి అనువైన ప్రాంతమని కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం అంశం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దశాబ్దాల కల అని చెప్పారు. ఇక్కడి ప్రజలు ఉన్నతవిద్య, ఉద్యోగాల నిమిత్తం దేశ,విదేశాలకు వెళ్తున్నారన్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బౌద్ధస్తూపం ఉన్నాయని వివరించారు.

4.విమానాశ్రయ నిర్మాణానికి కలెక్టర్‌ ఎంపిక చేసిన భూమి అనువుగా ఉందని ఎంపీ రఘురామ్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఎంపిక చేసిన భూమి తిరస్కరణకు గురైందని.. మూడు రాష్ట్రాల సరిహద్దున ఉన్న భద్రాద్రి జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణం ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. అత్యవసర సమయాల్లో బలగాల తరలింపునకు అనుకూలంగా ఉంటుందని కేంద్ర బృందానికి వివరించారు.

5.గరీబ్‌పేటలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఉన్న సానుకూల అంశాలను.. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేంద్ర బృందానికి వివరించారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో మన్యం జిల్లా పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. స్థలాన్ని పరిశీలించిన తర్వాత కలెక్టరేట్‌లో అందరూ కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రమాణాల ప్రకారం ఏఏఐ అధికారులకు వీలైనంత త్వరగా నివేదిక అందజేస్తామని.. కేంద్ర బృందం ప్రతినిధులు స్పష్టం చేశారు.

Whats_app_banner