Bandi Sanjay : డీలిమిటేషన్ పై చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై సమావేశం దొంగల ముఠా సమావేశంగా అభివర్ణించారు. లిక్కర్ దొంగలు ల్యాండ్ మాఫియా ఒక్కటై చంబల్ లోయ ముఠాగా మారి సమావేశమయ్యారని విమర్శించారు.
కరీంనగర్ సమీపంలోని చామనపల్లిలో మెడిసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంపై ఘాటుగా స్పందించారు. డీఎంకే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాంకు పాల్పడిందని ఆరోపించారు.
అనేక అవినీతి కుంభకోణాల్లో డీఎంకే కూరుకుపోయిందని దాన్నుంచి ప్రజలు దృష్టిని మళ్లించేందుకు డీలిమిటేషన్ పేరుతో దొంగలంతా సమావేశం అయ్యారని ఆరోపించారు. ఆలు లేదు..చూలు లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ప్రతిపక్షాల తీరుందని విమర్శించారు. డీలిమిటేషన్ పై ఇంతవరకు గైడ్ లైన్స్ వెలువడనే లేదని, డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు తగ్గే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా దోచుకున్నది దాచుకోవడానికి, అవినీతి స్కాంల నుండి బయటపడడానికి దొంగలంతా ఒక్కటై చైన్నైలో సమావేశం అయ్యారని విమర్శించారు.
చెన్నైలో జరిగేది డీలిమిటేషన్ సమావేశం కాదు... చంబల్ లోయ ముఠా సమావేశమని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని చెన్నై సమావేశంతో స్పష్టమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ కుటుంబ అవినీతి కేసులను కాంగ్రెస్ నీరుగారుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఇక కల్లా...జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఫాంహౌజ్ లో గడ్డి పీకుతున్నాడని విమర్శించారు. ఆరు గ్యారంటీలపై పోరాడకుండా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని విమర్శించారు. చెన్నైలో ఆ రెండు పార్టీలు ఒక్కటైనాయని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా దక్షిణాదిలో వికసించేది కమలమేనని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యంమని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామన్నారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో తాను లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. నాకు కేంద్ర మంత్రి బాధ్యతలు అప్పగించారని, జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నానని చెప్పారు. మీడియా, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. జాతీయ నాయకత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేయడమే క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తల పని అని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను... కార్యకర్తలతో కలిసి అనేక పోరాటాలు చేశానని ఇంకా తనకు రాష్ట్ర అధ్యక్షునిగా పని చేయాలనే ఆలోచన కూడా లేదన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే వారికి అధ్యక్ష పదవి రాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని తెలిపారు.
కరీంనగర్ మండలంలోని చామనపల్లిలో మెడిసిటీ ఆసుపత్రి యాజమాన్యం 3 రోజులపాటు నిర్వహించే ‘‘ఉచిత మెగా వైద్య శిబిరం’’ను బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అన్ని రకాల వ్యాధి నిర్దారణ పరీక్షల కౌంటర్లను కలియతిరిగి హెల్త్ చెకప్ చేసుకున్నారు. వైద్యం అత్యంత ఖరీదైన ఈరోజుల్లో ‘‘ఉచిత మెగా వైద్య శిబిరం’’ ప్రారంభించి వ్యాధి నిర్దారణ పరీక్షలు మొదలు సర్జరీల దాకా అన్నీ ఉచితంగా సేవలందిస్తున్న మెడిసిటీ ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. మెడిసిటి హాస్పిటల్ సిఇఒ ఇనిష్ మర్చంట్, జిల్లా అధ్యక్షులు క్రిష్ణారెడ్డి, నగర మాజీ మేయర్ సునీల్ రావు తదితరులతో కలిసి బండి సంజయ్ మాట్లాడుతూ చెవి, ముక్కు, గొంతు, చర్మవ్యాధులుసహా అన్ని రకాల వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించడంతోపాటు జనరల్ సర్జరీలకు సంబంధించిన టెస్టులన్నీ ఉచితంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
క్షయ వ్యాధితో నిత్యం వేలాది మంది చనిపోతున్నారని, క్యాన్సర్ వ్యాధితో నిత్యం మృత్యువుతో పోరాడుతున్న వారు మన రాష్ట్రంలోనే లక్షల సంఖ్యలో ఉన్నారని తెలిపారు. కారణం వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయించుకోకపోవడమేనని తెలిపారు. గుండె పోటుతో చనిపోతున్న వారిలో కరీంనగర్, ఖమ్మం జిల్లాల ప్రజలే ఎక్కువగా ఉన్నట్లు అనేక గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. ప్రాణాలను కాపాడటమే కాకుండా సాధారణ మనషులుగా మార్చేలా చికిత్స మనకు అందుబాటులో ఉందని, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వంటి పథకాన్ని అమలు చేస్తు 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా చికిత్స చేయించుకునే అవకాశం ఉందన్నారు. దేశంలోని 10 కోట్ల కుటుంబాలు.... అంటే దాదాపు 40 నుండి 50 కోట్ల మంది ‘ఆయుష్మాన్ భారత్’ కార్డు ద్వారా లబ్ది పొందుతున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఏదైనా ఉందంటే అది ‘ఆయుష్మాన్ భారత్’ మాత్రమేనని స్పష్టం చేశారు.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం