RTI : తెలంగాణ ఒక్క ప్రతిపాదన కూడా పంపలేదు.. మెడికల్ కాలేజీలపై ఆర్టీఐకి కేంద్రం సమాధానం-central govt replies to rti on ts medical colleges issue says no proposal came from telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Central Govt Replies To Rti On Ts Medical Colleges Issue Says No Proposal Came From Telangana

RTI : తెలంగాణ ఒక్క ప్రతిపాదన కూడా పంపలేదు.. మెడికల్ కాలేజీలపై ఆర్టీఐకి కేంద్రం సమాధానం

HT Telugu Desk HT Telugu
Mar 06, 2023 07:13 PM IST

RTI on Medical Colleges : పీఎంఎస్ఎస్వై స్కీమ్ కింద మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ మూడు విడతల్లో ఒక్క ప్రతిపాదన కూడా పంపలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై సమాచార హక్కు కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం... రాష్ట్రం నుంచి అసలు ప్రతిపాదనలే రాలేదని బదులిచ్చింది.

మెడికల్ కాలేజీలపై ఆర్టీఐకి కేంద్రం సమాధానం
మెడికల్ కాలేజీలపై ఆర్టీఐకి కేంద్రం సమాధానం

RTI on Medical Colleges : తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలల కేటాయింపు అంశంలో... బీఆర్ఎస్ సర్కార్, కేంద్రానికి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతోన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విడతల వారీగా మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మాత్రం కనీసం ఒక్క కళాశాల కూడా ఇవ్వకుండా.. రాష్ట్రంపై వివక్ష చూపుతోందని... బీఆర్ఎస్ మంత్రులు విమర్శిస్తున్నారు. అయితే... పీఎంఎస్ఎస్వై (PMSSY) స్కీం కింద వైద్య కళాశాలల కోసం రాష్ట్ర ప్రభుత్వం సమయానికి దరఖాస్తులు పంపలేదని, మంజూరు చేయకపోవడానికి రీజన్ అదే అని గతంలో పార్లమెంట్ వేదకగా కేంద్రం ప్రకటించింది. తాజాగా.. ఇదే అంశంలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై, మంత్రి హరీశ్ రావు మధ్య ట్విటర్ వార్ కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఇలా... రాష్ట్రానికి మెడికల్ కళాశాలల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల పరస్పర విమర్శలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఈ అంశంలో అసలు వాస్తవాలు ఏంటన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రానికి మెడికల్ కళాశాలల కేటాయింపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పీఎంఎస్ఎస్వై స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వైద్య కళాశాలలు కేటాయించారంటూ... ఆర్టీఐ యాక్టివిస్ట్ ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు... కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానం ఇచ్చింది. పీఎంఎస్ఎస్వై మొదటి మూడు విడతల్లో.. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని మెడికల్ కళాశాలలు, ఏ ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిందో తెలపాలంటూ కోరగా.... మూడు విడతల్లో దేశవ్యాప్తంగా 157 కళాశాలలు మంజూరు చేశామని కేంద్రం బదులిచ్చింది. ఏ దశలోనూ.. తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలు పంపలేదని ఆర్టీఐ ద్వారా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. నాలుగో దశ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ... నాలుగో విడత ఇంకా ప్రారంభించలేదని, రాష్ట్రాల నుంచి ఇంకా ఎలాంటి ప్రతిపాదనలు ఆహ్వానించలేదని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో... మెడికల్ కళాశాలల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని... ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 3 కళాశాలలు మంజూరు చేశామని చెప్పారని... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం 6 కాలేజీలు కేటాయించామని తెలిపారని.. ఇలా మంత్రులే ఒక్కోలా ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, ఇతర బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని చెప్పారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ మాట్లాడుతూ... ఈ స్కీమ్ కింద నిర్దేశించిన నియమ నిబంధనల మేరకు తెలంగాణలోని జిల్లాలకు కొత్త మెడికల్ కాలేజీలు పొందేందుకు అర్హత లేదని చెప్పారని వివరించారు. ఇలా.... బీజేపీ, బీఆర్ఎస్ నేతల మాటలతో... వైద్య కళాశాలల వివాదం ముదురుతోందని... ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలియజేయాలని రవికుమార్ కోరారు. మెడికల్ కాలేజీల విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

IPL_Entry_Point