TG Jawahar Navodaya Vidyalaya : తెలంగాణ విద్యార్థులకు కేంద్రం వరం.. 30 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం
TG Jawahar Navodaya Vidyalaya : తెలంగాణ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో 7 జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో 7 నూతన జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో కొత్తగా జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణకు 7 కొత్తవి కేటాయించడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు.
ఎక్కడెక్కడ..
తెలంగాణలో నిజమాబాద్, కొత్తగూడెం భద్రాద్రి, జగిత్యాల, మేడ్చేల్ మల్కాజ్‌గిరి, మహబుబ్‌నగర్, సూర్యపేట, సంగారెడ్డిలో కొత్తగా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్, ఖమ్మం, నాగర్‌కర్నూల్, సిద్దిపేట, నల్గొండ, కామారెడ్డి, రంగారెడ్డి, వరంగల్, కుమురంభీం ఆసిఫాబాద్‌లో ఇప్పటికే జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.
రెండింటితో..
దాదాపు 30 ఏళ్ల కిందట తెలంగాణ ప్రాంతంలో 1986-87లో రెండు విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1987-88లో ఐదు, మళ్లీ 1991-92లో ఒకటి, 1993-94లో మరొకటి ఏర్పాటయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు ఏకంగా ఏడు ఒకేసారి రాబోతున్నాయి.
ఎంతో మందికి మేలు..
తెలంగాణ రాష్ట్రంలోని 9 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 4,287 మంది చదువుకుంటున్నారు. వీరిలో బాలురు 2,566, బాలికలు 1,721 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు 3,684 మంది ఉండగా.. పట్టణ ప్రాంత చిన్నారులు 603 మంది ఉన్నారు. జనరల్ 449, ఓబీసీలు 1,949, ఎస్సీలు 1,039, ఎస్టీలు 850 మంది ఉన్నారు.
దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 28 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు 2024-29 మధ్యకాలంలో సుమారు రూ.2,359 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మూల ధన వ్యయం కోసం రూ.1,944 కోట్లు, పాఠశాలల నిర్వహణ కోసం రూ.415 కోట్లు ఖర్చవుతుందనేది అంచనా వేశారు.
జవహర్ నవోదయ విద్యాలయాలు పూర్తిస్థాయి రెసిడెన్షియల్ స్కూళ్లు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుంది. ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక్కో పాఠశాలలో బోధన, బోధనేతర కలిపి 47 మంది ఉంటారు.