Jangaon Accident : జనగామ జిల్లాలో సిమెంట్ లారీ బీభత్సం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టి షాపుల్లోకి దూసుకెళ్లిన లారీ
Jangaon Accident : జనగామ జిల్లా పాలకుర్తిలో సిమెంట్ లారీ బీభత్సం సృష్టించింది. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తు్న్న 10 మంది గాయపడ్డారు.

Jangaon Accident : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఆదివారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న ఓ లారీ అతి వేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులోని పది మంది ప్రయాణికులకు గాయాలు కాగా.. బస్సును ఢీకొన్న అనంతరం లారీ అక్కడున్న షాపుల్లోకి దూసుకెళ్లింది. అదృష్టావశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టి
స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మిర్యాలగూడ నుంచి సిమెంట్ బస్తాల లోడ్ తో వెళ్తున్న ఓ లారీ ఆదివారం ఉదయం పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాకు చేరుకుంది. కాగా తొర్రూరు వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు జనగామ వెళ్లేందుకు రాజీవ్ చౌరస్తా దాటుతుండగా..అటుగా వస్తు్న్న లారీ కంట్రోల్ తప్పింది. దీంతో లారీ ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టింది. అనంతరం అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు జనగామ రోడ్డు వైపు పార్క్ చేసి ఉన్న బైక్ లపైకి దూసుకెళ్లగా.. లారీ హనుమకొండ రోడ్డు వైపు ఉన్న షాపుల్లోకి దూసుకెళ్లింది. లారీ అక్కడున్న పాన్ షాపులోకి దూసుకెళ్లి క్యాబిన్ తో సహా అందులోనే ఇరుక్కుపోయింది.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన అనపర్తి చిలుకమ్మ, వెంకటయ్య అనే భార్యా భర్తలు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామానికి చెందిన కొత్త పద్మారెడ్డి తీవ్రంగా గాయ పడ్డారు. వారితో పాటు మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు గమనించి క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం జనగామ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కాగా లారీ బ్రేక్ ఫెయిల్ కావడం వల్లనే కంట్రోల్ తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
మరో ఘటనలో కారు బీభత్సం
పాలకుర్తి మండల కేంద్రంలో లారీ అదుపు తప్పి ప్రమాదం జరగగా.. జనగామ జిల్లా కేంద్రంలో మరో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం జనగామ జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులో అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన తొమ్మిది బైకులను ఢీకొంది. ఈ ప్రమాదంలో రోడ్డుపై వెళ్తున్న ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో నలుగురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. దీంతో క్షతగాత్రులను స్థానికులు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో తొమ్మిది బైకులు ధ్వంసం కాగా.. కారులో ఉన్న యువకులను స్థానికులు పట్టుకున్నారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారు బీభత్సంతో జనగామ జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులో భయానక వాతావరణం నెలకొంది. కాగా కంట్రోల్ తప్పిన కారు జనాలపైకి నేరుగా దూసుకెళ్లి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని స్థానికులు చెబుతున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం