Nagoba Jatara: ఆదివాసుల జాతర.. నాగోబా జాతర ప్రారంభం.. నేటి నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆదివాసీ జాతర-celebrating tribal heritage the nagoba jatara ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nagoba Jatara: ఆదివాసుల జాతర.. నాగోబా జాతర ప్రారంభం.. నేటి నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆదివాసీ జాతర

Nagoba Jatara: ఆదివాసుల జాతర.. నాగోబా జాతర ప్రారంభం.. నేటి నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆదివాసీ జాతర

HT Telugu Desk HT Telugu
Jan 28, 2025 12:54 PM IST

Nagoba Jatara: ఇంద్రవెల్లి ఆదివాసుల ఆరాధ్యదైవం రాష్ట్ర పండుగైన కేస్లాపూర్ జాతరకు వెళయింది. పుష్యమాసం అమావాస్య అర్ధరాత్రి నుంచి వంశీయులు ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నాగోబా మహా పూజకు మెస్రం వంశీయులు సిద్ధమయ్యారు. ఈ జాతర నేటి నుండి ఫిబ్రవరి 2 వరకు అధికారికంగా సాగనుంది.

ఆదిలాబాద్‌లో  నాగోబా జాతర ప్రారంభం
ఆదిలాబాద్‌లో నాగోబా జాతర ప్రారంభం

Nagoba Jatara: ఆదివాసీ నాగోబా జాతర ప్రారంభమైంది. మెస్రం వంశీయులు కాలినడకన గోదావరి హస్తినమడుగు నుంచి సేకరించిన గంగా జలంతో మర్రిచెట్టు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ పీఠాధిపతి వెంకట్రావ్కు ఆహ్వానం పలికారు. పూజకు ఒక రోజు ముందు తూమ్ పూజలను నిర్వహించారు.

మహా పూజలు ఇలా..

మర్రిచెట్టు వద్ద వివిధ సాంప్రదాయ పూజలు చేసిన మెస్రం వంశీయులు పూజ మంగళవారం రోజున డోలు, పెప్రే, కాళికొమ్ వాయిస్తూ నాగోబా ఆలయానికి వస్తున్నారు, నాగోబా ఆలయం పక్కనే ఉన్న గోవాడ్ (ప్రత్యేక కట్టడం) వద్దకు తీసుకెళ్లి బస చేస్తారు. ముందుగా మర్రిచెట్టు వద్ద ఉన్న పవిత్ర కోనేరు నుంచి మట్టి కుండల్లో మెస్రం వంశం అల్లుండ్లు నీరు తోడుతారు. ఆడపడుచులు ఆ నీటిని ఆలయం ప్రాంగణంలోకి తీసుకువెళ్తారు. అదే నీటితో ఆలయం పక్కనే ఉన్న పాత మట్టి పుట్టను అల్లుండ్లు తవ్వుతారు. ఆడపడుచులు అదే మట్టితో కొత్త పుట్టను తయారు చేస్తారు. ఆ పుట్టనుంచి మట్టిని ఉండల రూపంలో తీసుకుని ఏడు వరుసలో బౌల దేవతను ప్రతిష్టిస్తారు. అనంతరం సతీ దేవతల భౌలను తయారు చేసి, సాంప్రదాయ రీతిలో పూజలు చేయడం జరుగుతోంది.

రూ.10 కోట్లతో మందిరం నిర్మాణం..

గత ప్రభుత్వ హయంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో మందిరం నిర్మాణంతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహించారు. మెస్రం వంశీయుల వివిధ గ్రామాల నుంచి సేకరించిన విరాళాలతో రూ.6 కోట్లు సేకరించి గుడి గోపురం నిర్మాణం చేపట్టారు. దేవాదాయశాఖ ద్వారా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి తెచ్చిన రాతితో అద్దం పట్టేలా గుడి గోపురం నిర్మాణం చేశారు. నాలుగు ప్రాకార మండపాలను నిర్మించారు.

రాత్రి మహాపూజ.....

అమావాస్య రోజున పవిత్ర గంగా జలంతో ఆలయాన్ని శుద్ధి చేసి, నాగోబాకు జలాభి షేకంతో మహా పూజలను ప్రారంభిస్తారు. ఈ పూజలకు ఇతరులకు ప్రవేశం ఉండదు. అధికారులు ఇతర ప్రముఖులకు కల్పిస్తారు.

భేటింగ్ (పరిచయ) కార్యక్రమం..

నాగోబా మహా పూజ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మెస్రం వంశములో ఇప్పటి వరకు నాగోబా సన్నిధికి రాని కోడళ్లను కుటుంబ సభ్యులు వంశ పెద్దలను పరిచయం చేస్తారు. వారి నుంచి ఆశీస్సులు పొందుతారు. దీనిని భేటింగ్ అంటారు. ప్రతి ఏటా పదుల సంఖ్యలో ఈ భేటింగ్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంతో ప్రారంభమైనట్టు ప్రకటిస్తారు. కీతల వారిగ వంట పొయ్యిలు... అనంతరం గోవాడ్ వద్ద బస చేసిన మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు ముగింపు వరకు 22 కితాలు (వర్గాలు)గా పొయ్యిలు ఏర్పాటు చేసి వంటలను చేసి నైవేద్యాలను సమర్పిస్తారు. అనంతరం సహ పంక్తి భోజనాలను చేస్తారు.

పెర్సాపేన్ కు పూజలు..

నాగోబా పూజ అనంతరం రెండో రోజు ఆలయం వెనుక ఉన్న పెర్సాపేన్ దేవతకు పూజలు చేస్తారు. ఈ పూజను కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. భాన్ దేవతకు పూజలు.. మూడో రోజున భేటింగ్ లో పాల్గొన్న మెస్రం కోడళ్లు మర్రి చెట్టు వద్ద ఉన్న కోనేరు నుంచి మట్టి కుండల్లో తెచ్చిన నీటితో భాన్ దేవతకు సమర్పించి పూజలు చేస్తారు. ఈ పూజలో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉంటుంది.

31న అధికారిక ప్రజా దర్బార్...

ఆదివాసీ జీవితాల్లో నాగోబా దర్బార్కు పెద్ద పీట ఈ దర్బార్కు 79 వసంతాలు కావస్తోంది. 1940లో కెరామెరి జోడేఘాట్లో అమర వీరుడు కుమురంభీం నిజాం సైనికుల తూటాలకు అమరుడయ్యారు. ఆ తరువాత ఇంగ్లాండుకు చెందిన మానవ పరిణామ శాస్త్ర వేత్త హైమాన్ డార్ఫ్ 1946 నుంచి ఈ దర్బార్ను ప్రారంభించారు. ఈ దర్బార్ వేదికలో ఆదివాసుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేవారు. అప్పటి నుంచి ఈ దర్బార్ కొనసాగిస్తూనే ఉన్నారు.

బేతల్ పూజలు నృత్యాలు..

నాగోబా జాతర చివరి ఘట్టం ఇది. దర్బార్ పూర్తైన తరువాత మెస్రం వంశీయులు గోవాడ్ పక్కనే బేతల్ (కర్ర సాము) ఆట, నృత్యాలతో ముగింపు పలుకుతారు.

(కామోజీవేణుగోపాల్‌, ఆదిలాబాద్‌, హిందుస్తాన్ టైమ్స్‌)

Whats_app_banner