CBI Enquiry : నేడు కవితను విచారించనున్న సిబిఐ-cbi will question trs mlc kavita in delhi liquor scam issue
Telugu News  /  Telangana  /  Cbi Will Question Trs Mlc Kavita In Delhi Liquor Scam Issue
ఎమ్మెల్సీ కవిత(ఫైల్ ఫొటో)
ఎమ్మెల్సీ కవిత(ఫైల్ ఫొటో)

CBI Enquiry : నేడు కవితను విచారించనున్న సిబిఐ

11 December 2022, 6:29 ISTHT Telugu Desk
11 December 2022, 6:29 IST

CBI Enquiry ఢిల్లీమద్యం సిండికేట్ల వ్యవహారంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు సిబిఐ విచారించనుంది. సిఆర్‌పిసి 160 కింద కవితకు ఇప్పటికే సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల ఆరున విచారణకు హాజరు కావాలని కోరిన ముందస్తు కార్యక్రమాల నేపథ్యంలో ఆ రోజు విచారణకు హాజరు కాలేనంటూ కవిత చెప్పడంతో నేడు విచారించనున్నారు.

CBI Enquiry ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యహహారంలో నేడు ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కానున్నారు. తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని కవిత చెప్పడంతో ఉదయం 11గంటలకు సిబిఐ అధికారులు ఆమెను విచారించనున్నారు. కవిత నివాసంలోనే సిబిఐ విచారణ సాగనుంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో కవిత ప్రమేయంపై పలు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీని మద్యం సిండికేట్లకు అనుకూలంగా మార్చడంతో కవిత ప్రమేయం ఉందని గత ఆగష్టులోనే బీజేపీ ఆరోపించడం కలకలం రేపింది. ఆ తర్వాత ఈ వ్యవహారం రకరకాల మలుపులు తిరిగింది.

ఎమ్మెల్సీ కవితను ఈ నెల ఆరోతేదీన విచారిస్తామని సిబిఐలేఖ రాయడంతో తొలుత విచారణకు హాజరు కావడానికి అంగీకరించిన కవిత తర్వాత ఎఫ్‌ఐఆర్‌ కాపీ కావాలని కోరారు. సిబిఐ వెబ్‌సైట్‌లో ఎఫ్‌ఐఆర్‌ కాపీ అందుబాటులో ఉంచడంతో విచారణ మరో రోజు నిర్వహించాలని కవిత కోరారు. 11,12,14,15 తేదీలలో విచారణ నిర్వహించాలని సిబిఐను కోరారు.

కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసిన తర్వాత కవిత తన తండ్రితో పలుమార్లు భేటీ అయ్యారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సిబిఐ నోటీసులు జారీ చేశారని టిఆర్ఎస్ ఆరోపించింది. మరోవైపు ఆదివారం కవితను సిబిఐ విచారించనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. శనివారం కూడా ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మంత్రి మండలి సమావేశం పూర్తైన తర్వాత కేసీఆర్‌ కవితతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అవేమి ఫలించవని సిబిఐ విచారణకు కూడా అందులో భాగమేనని కవితకు కేసీఆర్ ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. సిబిఐ అధికారులకు ధైర్యంగా సమాధానాలు చెప్పాలని కుమార్తెకు కేసీఆర్ సూచించారు. ఆదివారం సిబిఐ విచారణ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు తమ ఇంటికి రావొద్దని కవిత విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లే దారిలో పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. కవిత ఇంటి వద్ద భారత రాష్ట్ర సమితి నేతలు భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. యోధుని కుమార్తె ఎన్నటికీ భయపడదంటూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. కవితను సిబిఐ ప్రశ్నించనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో ఉంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో ఇప్పటికే అరెస్టైన వారికి బెయిల్ మంజూరు కాకపోవడం, కుంభకోణంలో టిఆర్ఎస్‌ నాయకుల పాత్ర కూడా ఉందని బీజేపీ ఆరోపిస్తుండటంతో సిబిఐ ఎలా వ్యవహరిస్తుందోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.