Delhi Liquor Scam Case : లిక్కర్ కేసులో సీబీఐ అనుబంధ ఛార్జీషీట్ - కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Delhi Excise Case Updates: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత రిమాండ్ గడువును పొడిగించింది.
Delhi Excise Case Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్రపై అనుబంధ ఛార్జీషీట్ ను దాఖలు చేసింది. దీనిపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. సీబీఐ ఛార్జీషీట్ ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం… జూన్ 21వ తేదీ వరకు కవిత రిమాండ్ పొడిగించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ… కోర్టు నిరాకరిస్తూ వస్తోంది.
ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో గత మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సీబీఐ మరో కేసు నమోదు చేసింది. ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. తాజాగా సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జీషీట్ ను కూడా పరిగణనలోకి తీసుకోవటంతో… కవిత రిమాండ్ ను పొడిగించింది.
మార్చి 15న కవిత అరెస్ట్….
దిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతికి పాల్పడ్డారంటూ 2024 మార్చి 15న హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. అదే రోజు రాత్రి ఆమెను దిల్లీకి తరలించారు. మార్చి 16న ఎమ్మెల్సీ కవితను ట్రయల్ కోర్టు ముందు హాజరుపరిచారు. దిల్లీ లిక్కర్ కేసులో కవితను ముఖ్య పాత్ర పోషించారని ఈడీ వాదనలు వినిపించింది.
కవిత ప్రోద్బలంతోనే సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు ఆప్ నేతలకు అందాయని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో కవితనను విచారించేందుకు మొత్తం 10 రోజులకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈడీ విచారణ అనంతరం మార్చి 26న ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈడీ కేసులో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మూడు రోజుల పాటు సీబీఐ విచారించి కోర్టులో హాజరుపర్చింది. సీబీఐ కేసులోనూ దిల్లీ కోర్టు కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఈ కేసుల్లోనే కవిత పాత్రపై సీబీఐ, ఈడీ అనుబంధ ఛార్జీషీట్లను దాఖలు చేస్తూ వస్తోంది. మరోవైపు కవిత బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిరాశే ఎదురవుతోంది. తాజాగా కోర్టు రిమాండ్ పొడిగించటంతో… జూన్ 21వ తేదీన తదుపరి ఆదేశాలు రానున్నాయి.